సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందని, అనేక చేదు అనుభవాలను మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనతో ఇటు తెలంగాణగానీ, అటు ఏపీగానీ సంబరాలు చేసుకోలేపోయాయని.. విభజన సమయంలో విషపు బీజాలు నాటబడ్డాయని విమర్శించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా సోమవారం పార్లమెంట్ 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రసంగించిన మోదీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అందరి సమ్మతితో కష్టతరమైన పనులనూ పార్లమెంటు పూర్తి చేసింది.
ఇదే సభలో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్ధంగా మూడు రాష్ట్రాల విభజన జరిగింది. ఆ రాష్ట్రాల విభజన సమయంలో అన్నిచోట్లా సంబరాలు జరిగాయి. ఉత్తరాఖండ్ ఏర్పాటు సమయంలో దాని మాతృ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సంబరాలు చేసుకుంది. అలాగే ఛత్తీస్‌గఢ్ ఏర్పాటు సమయంలో మధ్యప్రదేశ్.. జార్ఖండ్ ఏర్పాటు సమయంలో బిహార్ కూడా సంబరాలు చేసుకున్నాయి. అందరి సమ్మతితో సుహృద్భావ వాతావరణంలో విభజన జరిగింది. కానీ కొన్ని చేదు జ్ఞాపకాలు మిగిలిపోయాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది. రక్తపుటేర్లు పారాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రెండూ సంబరాలు చేసుకోలేకపోయాయి. విభజన సమయంలో విష బీజాలు నాటబడ్డాయి. వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటైన మాదిరిగా అదే ఉత్సాహంతో తెలంగాణను ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది.
ఈ రోజు తెలంగాణ ఒక కొత్త శిఖరానికి చేరుకునేది..’’అని మోదీ పేర్కొన్నారు. నిజానికి గత ఏడాది ఫిబ్ర వరి 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోదీ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. విభజన సరిగా జరగలేదని.. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన ఏపీని సిగ్గుపడేలా కాంగ్రెస్ విభజించిందని ఆరోపించారు.
పోరాట స్ఫూర్తిని కించపర్చేలా మోదీ వ్యాఖ్యలు: రేవంత్‌రెడ్డి
తెలంగాణ పోరాట స్ఫూర్తిని కించపర్చేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణ త్యాగాల విలువ, పోరాట స్ఫూర్తిని కించపర్చేలా మోదీ మాట్లాడటం ఘోరం. రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీగా తెలంగాణ గుండె చప్పుడు తెలుసుకాబట్టే మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు. మనం బీజేపీని తరిమికొడదాం’’అని ‘ఎక్స్’లో పిలుపునిచ్చారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమే: రాహుల్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానించడమే..’’అని మంగళవారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలు సరికాదు: బీఆర్‌ఎస్
విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు సభలో తిప్పికొట్టారు. బీఆర్‌ఎస్ తరఫున ప్రసంగించిన నామా... ‘‘తెలంగాణ ఏర్పాటు చేదు జ్ఞాపకాలను మిగిలి్చందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు సరికాదు. తెలంగాణ నేడు దేశంలోనే నంబర్‌వన్‌గా ఉంది. తలసరి ఆదాయం, తల సరి విద్యుత్ వినియోగంలో నంబర్‌వన్ స్థానంలో ఉంది.
రైతు బంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు దేశంలో తెలంగాణ మోడల్ రావాల్సి ఉంది..’’అని పేర్కొన్నారు. ఒకప్పుడు బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలే ఉంటే ఇప్పుడు 300కు పైగా ఉన్నారని, పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారని... అదే మాదిరి గా ఇద్దరు ఎంపీలే ఉన్నా తమ పార్టీ కొట్లాడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సాధించిందని చెప్పారు.
ఇక నూతన పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నామా డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టామని, హైదరాబాద్‌లో 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళిత పక్షపాతని కేసీఆర్ నిరూపించుకున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment