ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ అవమానపరిచిందంటూ బీజేపీ చేసిన విమర్శలకు పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. డోర్ లాక్ అవ్వడం వల్ల ఆయన కొద్దిసేపు మాత్రమే బయట వేచి ఉన్నారని.. నామినేషన్ ప్రక్రియ సమయంలో ఆయన లోపలే ఉన్నారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ చేస్తున్న విమర్శలు ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.
తలుపుకి తాళం వేసి ఉండటం వల్ల లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా లోపలికి వచ్చే ముందు కొన్ని నిమిషాలు వేచి ఉన్నారని వేణుగోపాల్ తెలిపారు. ‘బీజేపీ ఇలాంటి అబద్ధాలు ఎలా ప్రచారం చేస్తుంది?. సభ పూర్తయ్యాక కలెక్టరేట్‌కు చేరుకోగానే డోర్ మూసి ఉంది. తరువాత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ అక్కడికి వచ్చారు.. వారు కూడా కొన్ని నిమిషాలు వేచి చూసి లోపలికి వచ్చారు.
ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే కూడా వచ్చి తలుపు తాళం వేసి ఉండటంతో నిమిషంపాటు బయట వేచి ఉన్నారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాతే ప్రియాకం నామినేషన వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై, పార్టీపై బీజేపీ ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు? ఇది సరైంది కాదు.’ అని పేర్కొన్నారు.
కాగా వయనాడ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తన తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
అయితే నామినేషన్ సమర్పణ సమయంలో ఖర్గేను అగౌరవ పరిచారని, రిటర్నింగ్ అధికారి గదిలోకి రానివ్వకుండా బయటే ఉంచారని బీజేపీ ఆరోపించింది. అంతేకాదు దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వేషాన్ని పెంచుకుంటోందని విమర్శించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా కాషాయ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment