చండీగఢ్: అతని పేరు ఓంప్రకాశ్ జఖూ. వయసు 80 ఏళ్లు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ నివాసి. బూట్లు పాలిష్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయినా తన కోరికను తీర్చుకోవడంలో తగ్గేదేలే అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఆయనకి మహా ఇష్టం. ఆయన జీవితంలో సగభాగం ఎన్నికల్లో పోటీకే సరిపోయింది. ఒక్కసారి కూడా గెలవకపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్లీ ఎన్నికల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇలా పోటీ చేయడాన్ని ఆయన గర్వంగా కూడా భావిస్తారు. ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భరతరాష్ట్ర డెమొక్రాటిక్ పార్టీ అని పెద్దగా ఎవరికీ తెలీని పార్టీ తరఫున హోషియార్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఇలా ఎన్నికల్లో పోటీ పడడం ఇది 20వ సారి. కేవలం అసెంబ్లీ ఎన్నికలే కాదు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓంప్రకాశ్ పోటీ చేశారు. ఏ పూట సంపాదన ఆ పూ టకే సరిపోయే దుర్భర దారిద్య్రంలో కూడా ఆయన ఎన్నికలకి దూరం కాలేదు. ఈ విషయంలో ఆయనకి భార్యాబిడ్డల సహ కారం కూడా ఉంది. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో జైలు పా లయ్యారు. ఒకప్పుడు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌తో సన్నిహితంగా మెలిగారు. ఎన్నికల్లో పోటీ చేయడమంటే తనకు అత్యంత ఇష్టమైన విషయమని, శ్వాస ఆగేవరకు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని ఓంప్రకాశ్ చెప్పుకొచ్చారు.
చదవండి: (Punjab Assembly Election 2022: మాల్వా చిక్కితే అసెంబ్లీ అందినట్టే)
Comments
Please login to add a commentAdd a comment