సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్‌పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో చరణ్‌జీత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అయితే పంజాబ్‌లో పరిస్థితిని చక్కబెట్టామని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్న తరుణంలో, హైకమాండ్ నిర్ణయం ఇతర రాష్ట్రాల్లో అధికార మార్పు దిశగా క్యాంపు రాజకీయాలను పెంచే విధంగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అంతేగాక 2018లో రాజస్తాన్‌లో అశోక్ గహ్లోత్‌ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మొదలైన గ్రూప్ రాజకీయాలకు పంజాబ్ పరిణామాలు మరింత ఊతం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
హామీలు నెరవేర్చండి
పంజాబ్‌లో సీం మార్పు, రాజస్థాన్‌లోని సచిన్ పైలట్ వర్గంలో నూతనోత్సాహాన్ని నింపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అశోక్ గహ్లోత్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని గత కొన్నేళ్లుగా పైలట్ వర్గం నాయకులు చేస్తున్న డిమాండ్ మరోసారి ఊపందుకుంటుందని చర్చ జరుగుతోంది. గతంలో రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడం తెలిసిందే. పైలట్ తిరుగుబాటు చేసి క్యాంపు రాజకీయాలు నెరిపారు. అయితే పార్టీ హైకమాండ్ పంపిన ట్రబుల్ షూటర్, దివంగత అహ్మద్ పటేల్ నేతృత్వంలోని కమిటీ జోక్యంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. కానీ పార్టీ హైకమాండ్ ఏడాది కిందట ఇచ్చిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ హామీని ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై పైలట్ క్యాంపులో గత కొంతకాలంగా అసంతృప్తి కొనసాగుతోంది. పంజాబ్‌లో జరిగిన అధికార మార్పు పరిణామాల ప్రభావంతో తమకు మంచి రోజులు రానున్నాయని పైలట్ వర్గీయులు భావిస్తున్నారని సమాచారం. పార్టీ హైకమాండ్ త్వరలోనే రాజస్తాన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఎమ్మెల్యేల్లో పట్టు
అయితే అశోక్ గహ్లోత్‌కు పార్టీ హైకమాండ్ వద్ద పరపతి, ఎమ్మెల్యేల్లో పట్టు ఉన్నందున రాజస్తాన్‌లో రాజకీయ పరిస్థితి పంజాబ్ కంటే భిన్నంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో పంజాబ్‌లో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అధికార మార్పు నిర్ణయం తీసుకుందని, అయితే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నందున అధికార మార్పుపై ఎలాంటి నిర్ణయం త్వరలో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అంతేగాక పార్టీలో ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు పార్టీ హైకమాండ్ ఇతర మార్గాలను అన్వేషించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంజాబ్ ఎపిసోడ్‌తోనైనా కాంగ్రెస్ హైకమాండ్ తాము అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే ఎక్కువైన వర్గపోరుపై దృష్టిసారించాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి మధ్యప్రదేశ్‌లో వర్గపోరు కారణంగా కాంగ్రెస్ పార్టీ అధికార పీఠానికి దూరమైన ఎపిసోడ్‌ను గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ దేవ్ మధ్య వైరం తారాస్థాయికి చేరుకుంది. రెండున్నరేళ్ల తర్వాత రాష్ట్ర పగ్గాలు తనకు అందిస్తానని రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్న సింగ్ దేవ్ సోమవారం ఢిల్లీకి రావడంతో రాజకీయ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాను వ్యక్తిగత కారణాలతో ఢిల్లీ వచ్చానని, అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయాయని సింగ్ దేవ్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాకు తెలిపారు.
హస్తినలో మకాం
తాజా పరిణామాల నేపథ్యంలో ఇరువర్గాలకు చెందిన కొందరు నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. సచిన్ పైలట్ గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అజయ్ మాకెన్‌లతో భేటీ అయ్యారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పైలట్ వర్గ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అపాయింట్‌మెంట్ కోరారు. అంతేగాక రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితిపై అజయ్ మాకెన్ ఇటీవల తన నివేదికను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించారని ఏఐసీసీ కీలక నేత ఒకరు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీర్ మీనా, రెవెన్యూ మంత్రి హరీష్ చౌదరి, ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మతో సహా పలువురు నాయకులు పార్టీ హైకమాండ్ ముందు సీఎం అశోక్ గహ్లోత్‌కు మద్దతుగా లాబీయింగ్ చేస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment