జైపూర్: మహిళలపై జరుగుతున్న అకృత్యాలకుగానూ.. సొంత ప్రభుత్వాన్ని, అదీ అసెంబ్లీ సాక్షిగా నిలదీసిన మంత్రికి గంటల వ్యవధిలోనే కేబినెట్ నుంచి ఉద్వాసన పలికింది రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం. శుక్రవారం ఈ పరిణామం చోటు చేసుకోగా.. ఆ నేత వ్యాఖ్యలతో ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
రెండున్నర నెలలుగా మణిపూర్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు.. తాజాగా వెలుగులోకి వచ్చిన అకృత్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రంతో పాటు మణిపూర్ ప్రభుత్వం పైనా ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే.. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించిన మంత్రి రాజేంద్ర సింగ్ గుధా.. రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాల కట్టడికి మన ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.
‘‘ఇక్కడ కఠిన వాస్తవం ఏంటంటే.. మన ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమవుతోంది. రాజస్థాన్‌లో మహిళలపై అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కాబట్టి.. మణిపూర్ అంశంపై దృష్టిసారించే బదులు ముందు నా సహచరులు ముందు మన సంగతి చూసుకోవడం ఉత్తమం’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. రాజస్థాన్ మినిమమ్ గ్యారెంటీ బిల్ 2023పై చర్చ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖల మంత్రిగా ఉన్న గుధా ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయ సంచలనానికి దారి తీయగా.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. రాజేంద్ర సింగ్ గుధాను మంత్రివర్గం నుంచి వెంటనే తొలగిస్తున్నట్లు రాజస్థాన్ రాజ్‌భవన్‌కు సిఫార్సు పంపగా.. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా దానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. గంట వ్యవధిలోనే ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి.
ఇక ప్రతిపక్ష బీజేపీ రాజేంద్ర వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుని.. కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తోంది. అంతకు ముందు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరంభానికి ముందు కూడా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తింటున్నాయని, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: మా దగ్గరా మణిపూర్‌లాంటి ఘటనే జరిగింది: బీజేపీ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment