
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక ప్రకటన చేశారు. ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రారంభించలేనని స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇందుకు తనను క్షమించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి రాకుండానే సేవ చేస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘‘నేను రాజకీయాల్లోకి రాలేనని చెప్పడానికి ఎంతగానో చింతిస్తున్నా. ఈ నిర్ణయం తీసుకున్నపుడు నేనెంతగా బాధపడ్డానో నాకే తెలుసు. ఈ ప్రకటన నా అభిమానులను ఎంతగా బాధపెడుతుందో తెలుసు. దయచేసి నన్ను మన్నించండి. రాజకీయాల్లో ప్రవేశించకుండానే నేను ప్రజాసేవ చేస్తాను’’ అంటూ మూడు పేజీలతో కూడిన లేఖను ట్విటర్‌లో షేర్ చేశారు. కాగా అన్నాత్తే షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురైన రజనీకాంత్ ఇటీవలే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. హైబీపీతో బాధపడిన ఆయన ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: రాజకీయాలు వద్దు నాన్నా...)
డిసెంబరు 3న ప్రకటన
కాగా 2017 డిసెంబరులో ‘అరసియల్‌కు వరువదు ఉరుది’ (రాజకీయాల్లోకి రావడం ఖాయం) అని బహిరంగంగా ప్రకటించిన తలైవా రజనీకాంత్ అనేక పరిణామాల అనంతరం ఈనెల 3న పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. జనవరిలో కొత్త పార్టీ పెడతానని, డిసెంబరు 31న ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. అంతేగాక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమూలంగా మార్చివేస్తామని పేర్కొన్నారు. అయితే అనారోగ్య కారణాలతో రజనీ ప్రస్తుతం రాజకీయ పార్టీ స్థాపనపై వెనక్కి తగ్గారు. కుటుంబ సభ్యులు ముఖ్యంగా కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య ఒత్తిడి మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
— Rajinikanth (@rajinikanth) December 29, 2020
Comments
Please login to add a commentAdd a comment