సాక్షి, చెన్నై: రాజకీయ పయనం, పార్టీ విషయంగా తలైవా రజనీకాంత్ దారి ఎటో అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. సోమవారం రజనీ మక్కల్ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో రజనీకాంత్ రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా భేటీ కానున్నారు. జయలలిత, కరుణానిధిల మరణంతో రాష్ట్రంలో నాయకత్వం కొరవడినట్టుగా చర్చ సాగుతున్న నేపథ్యంలో 2017 డిసెంబర్ 31న రజనీకాంత్ చేసిన ప్రకటన అశేషాభిమాన లోకాన్ని ఆనందసాగరంలో ముంచింది. రాజకీయాల్లోకి వచ్చేశా, పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొందామని రజనీకాంత్ ప్రకటన చేసి మూడేళ్లు కావస్తోంది. రజనీ మక్కల్ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదు తప్ప, ఈ కాలంలో తలైవా పార్టీ ఊసే లేదు.
అదిగో పార్టీ, ఇదిగో జెండా అంటూ ప్రచారాలు హోరెత్తినా, చివరకు రజనీ రాజకీయ పయనం సాగేనా అన్న అనుమానాలు తాజాగా బయలుదేరాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూ హాలకు పదును పెట్టి ఉంటే, తమ పార్టీ ప్రస్తావన లేకపోవడం కథానాయకుడి అభిమానులకు నిరాశే. ఈ సమయంలో కొద్ది రోజుల క్రితం రజనీ పేరిట సామాజిక మాధ్యమాల్లో అనారోగ్యకారణాలతో ఇక పార్టీ లేనట్టే అంటూ ప్రచారం హోరెత్తింది. ఇందుకు సమాధానం ఇచ్చే క్రమంలో అది తన ప్రకటన కాదని, అయితే, అందులో పేర్కొన్న ఆరోగ్యపరమైన సమస్యలను రజనీకాంత్ పరోక్షంగానే అంగీకరించారు. మండ్రం నిర్వాహకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఇందుకు సమయం ఆసన్నమైనట్టుంది. చదవండి: (దేవుడే దిక్కు.. నిత్యపూజలు, ప్రార్థనలు)
నేడు మండ్రం వర్గాలతో భేటీ..
రజనీకాంత్ రాజకీయపయనం సాగేనా, పార్టీ ప్రకటించేనా అన్నది మరికొన్ని గంటల్లో తేలే అవకాశాలు ఉన్నాయి. ఇందు కోసం సోమవారం కోడంబాక్కం రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా మండ్రం కార్యదర్శులు, ముఖ్యనిర్వాహకులతో భేటీకి రజనీకాంత్ నిర్ణయించారు. మక్కల్ మండ్రం కార్యదర్శులు 40 మంది, ముఖ్య నిర్వాహకులు పది మందితో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ భేటీ సాగబోతోంది. తొలుత అందరి అభిప్రాయాలు తీసుకునే రజనీకాంత్, చివర్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. ఈ సమావేశం వ్యవహారం పోలీసు భద్రత కోరుతూ రజనీ మక్కల్ మండ్రం పెట్టుకున్న విజ్ఞప్తి ద్వారా వెలుగు చూసింది. చదవండి: (అతి భారీ వర్షాలు: 2న రెడ్ అలర్ట్)
రజనీకాంత్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా, భద్రత కల్పించాలని కోడంబాక్కం పోలీసులకు రజనీ మక్కల్ మండ్రం విజ్ఞప్తి చేసింది. ఈ దృష్ట్యా, సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటన చేస్తారా అన్నది ఈ సమావేశం ద్వారా తేలొచ్చని అయితే, ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారని మక్కల్‌మండ్రం కార్యదర్శి ఒకరు పేర్కొన్నారు. రజనీకాంత్‌కు ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నట్టుగా సంకేతాలు బయలుదేరిన నేపథ్యంలో రాజకీయపయనం, పార్టీ విషయంగా ఎలాంటి ప్రకటన చేస్తారో అన్న ఎదురుచూపుల్లో రజనీకాంత్ అభిమానులు ఉన్నా రు. రాఘవేంద్ర కల్యాణ మండపం వైపు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశాలతో ఆ పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment