విపక్ష నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఇళ్లకు వెళుతున్నారు
ప్రభుత్వ వైఫల్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయి
కేసీఆర్ పొలం బాటతోనే కళ్లు తెరచిన సర్కార్
రైతులకు ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధం: హరీశ్ రావు ధ్వజం
సాక్షి, సిద్దిపేట: విపక్షనేతల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకునే శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. పంటలు ఎండిపోతుంటే సీఎం, మంత్రులు ఇంతవరకు వెళ్లి చూడలేదన్నారు. రైతులను ఆదుకునేందుకు సమయం దొరకడం లేదని, కానీ బీఆర్‌ఎస్ నేతలను తిట్టడం, కేసులు పెట్టడం బిజీగా ఉన్నారని చెప్పారు.
మంగళవారం ఎండిన పంటలకు ఎకరాకు రూ. 25 వేలు నష్టపరిహారం, పంటలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ మనుచౌదరికి హరీశ్‌రావు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యం, విద్యుత్ లోపాల వలన రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయన్నారు. కేసీఆర్ పొలం బాట పట్టాకే సర్కారు కళ్లు తెరిచిందని చెప్పారు.
ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా..?
భట్టి ఒట్టి మాటలు కట్టిపెట్టాలని, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలన్నారు. తక్షణమే రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీల విషయంలో ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు.
కలిస్తే జోడీ..లేదంటే ఈడీ
గజ్వేల్: ‘కలిస్తే జోడీ..లేదంటే ఈడీ అనే తరహాలో బీజేపీ వ్యవహరిస్తుండగా, వంద రోజుల పాలనలో కాంగ్రెస్ వైఫ్యలాలను మూటగట్టుకున్నదని..ఈ రెండు పార్టీలకు ఎంపీ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరముంది’అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మెదక్ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ వంద రోజుల పాలనలో 200మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పేదల కోసం పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలుచేసిన తర్వాతే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు అడగాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో ప్రజల తిరస్కరణకు గురైన రఘునందన్‌రావుకు ప్రజలు ఓటు వేసే అవకాశమే లేదని చెప్పారు. బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తే..రూ.100 కోట్ల తన నిధులతో ట్రస్టు స్థాపిస్తానని హామీ ఇచ్చారు.
పాల బిల్లులు చెల్లించండి సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాడి రైతులకు చెల్లించాల్సిన రూ.80 కోట్ల పాల బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన మంగళవారం లేఖ రాశారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లులు క్రమపద్ధతిలో చెల్లించేదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదని తన లేఖలో పేర్కొన్నారు. దీంతో 45 రోజులుగా రైతులకు రావాల్సిన రూ.80 కోట్ల మేర పాల బిల్లులు పెండింగులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాడి రైతులకు బకాయిలు చెల్లించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment