కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ విషయంలో బీజేపీ అధిష్టానం వేసిన అంచనా ఘోరంగా తప్పిందా?. తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి నుంచి తొలగించడమనే పెను మార్పు బెడిసి కొట్టిందా?. బీజేపీ స్టేట్ కేడర్ మాత్రమే కాదు.. చిన్నాచితకా పదవుల్లో ఉన్న వాళ్లు.. సంజయ్ ఫ్యాన్స్‌తో పాటు హార్డ్‌కోర్ బీజేపీ అభిమానుల నుంచి కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి ఎదుర్కొంది అధిష్టానం. ఈ తరుణంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం కమలాధిష్టానం తాజా నిర్ణయం తీసుకుందనే విశ్లేషణ నడుస్తోంది. అందుకు కారణాలను గమనిస్తే..
మాజీ తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి(మొత్తం ఎనిమిది మందిలో ఆయనొకరు) దక్కింది. ఆయన్ని బుజ్జగించే క్రమంలోనే ఈ ‘ప్రమోషన్’ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన వ్యవహరించింది. అటు బండితో పాటు ఇటు ఆయన్ని తప్పించడంపై అసంతృప్తితో రగిలిపోతున్న వాళ్లనూ చల్లార్చినట్లయ్యింది. తద్వారా రాష్ట్రంలో పార్టీ శ్రేణుల్లో జోష్ నిండి.. ఉత్సాహాంగా పని చేయాలనే ఆలోచనగా స్పష్టమవుతోంది.
✍️ ఊహించని పరిణామం
కరోనా సమయంలో బాధ్యతలు చేపట్టిన కరీంనగర్ బండి సంజయ్ కుమార్.. కారు పార్టీని కమలంతో ఢీ కొట్టే స్థాయిలో దూకుడుగా ముందుకు నడిపించారు. ఈ క్రమంలో.. ప్రభుత్వాన్ని ఏకేసే క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చొరబడే సందు కూడా ఇవ్వలేదు ఆయన. ఛాన్స్ దొరికినప్పుడల్లా కేసీఆర్ అండ్ కోపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ.. తన అగ్రెసివ్‌నెస్‌తో బీజేపీకి ఒక ఊపు తీసుకురావడమే కాదు.. నిత్యం పొలిటికల్ చర్చల్లో ఉండేలా చేసింది కూడా ఆయనే. ఈ క్రమంలో అరెస్టయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తిని పార్టీ బలపడుతుందనుకున్న టైంలో.. అదీ ఎన్నికల ముందర తప్పించడంపై పార్టీ మెజార్టీ శాతం నుంచి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. బండిని తొలగించిన ప్రకటన వెలువడగానే.. పలుచోట్ల రాజీనామాల పర్వం కూడా కొనసాగింది. అయితే ఈ స్థాయి వ్యతిరేకతను బీజేపీ అధిష్టానం సైతం ఊహించలేదు.
✍️ వ్యూహాత్మక నిర్ణయమేనా?
పాదయాత్రల ద్వారా పార్టీపై జనాల్లో ఫోకస్ పెరిగే చేయడమే కాకుండా.. పార్టీ అగ్రనేతలను తెలంగాణకు రప్పించగలిగారు బండి సంజయ్. ఆ సమయంలో ‘సాహో.. సంజయ్’ అంటూ భుజం తట్టారు బీజేపీ పెద్దలు(ప్రధాని సహా). కానీ, అవమానకర రీతిలో తొలగించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. బండి సారథ్యంలో బీజేపీ వర్గపోరుతో క్యాడర్‌లో అయోమయం నెలకొందనే సాకు.. పైగా చేరికలు ఆగిపోవడానికి బండినే కారణమంటూ ఇచ్చిన ‘తప్పుడు’ నివేదికలు ఆయనకు పదవిని దూరం చేశాయనే ప్రచారం ఒకటి ఉంది. అయితే.. బండిని మార్చడం ద్వారా తెలంగాణలో పూడ్చలేని అపఖ్యాతిని కాషాయం పార్టీ మూటగట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ నిర్ణయం తప్పుబడుతూ సాధారణ పౌరులు సైతం పోస్టులు చేశారు. కార్యకర్తలు, బండి అభిమానులు పార్టీలో యాక్టివ్‌గా పని చేయడం తగ్గించేశారు. ఈ నిరసన సెగ.. హస్తినకు చేరింది.
ఈ తరుణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే.. క్యాడర్ చల్లబడుతుందని, పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే సమాలోచనలు జరుపుతూ వచ్చింది బీజేపీ అధిష్టానం. వీటికి తోడు.. దూకుడు మీదున్న బండి సంజయ్‌ను మార్చడం బీఆర్‌ఎస్‌కే అనుకూలిస్తుందనే సంకేతాల్ని ప్రజల్లోకి పంపినట్లు అవుతుందన్న కేడర్ అభిప్రాయంతో ఢిల్లీ పెద్దలు సైతం ఏకీభవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే మళ్లీ సాహో సంజయ్ అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తెలంగాణ పార్టీ చీఫ్ మార్పు-ఎంపిక విషయంలో మాత్రం స్ట్రాటజికల్‌గానే నిర్ణయం తీసుకున్నట్లు ఓ హస్తిన నేత చెబుతున్నారు.
✍️ బండి సేవలు అలానా?
బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించినా.. అవి మీడియా కథనాలకే పరిమితం అవుతూ వచ్చాయి. అయితే.. ఈలోపే పార్టీకి జరిగిన డ్యామేజ్‌తో బండి బలమేంటో బీజేపీ అధిష్టానం గుర్తించింది. తీవ్ర మల్లాగుల్లాల తర్వాత బండి సంజయ్‌కు జాతీయ పదాధికారుల బృందంలో చోటు కల్పించింది. తెలంగాణలో కిషన్‌రెడ్డి సారథ్యంలో పని చేయాలని సూచిస్తూనే.. ఏదైనా ఒక రాష్ట్రానికి బండి సంజయ్‌ను ‘వ్యవహారాల ఇంఛార్జి’గానూ నియమించే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు.
రాష్ట్రాలకు పార్టీ చీఫ్‌లు, ఇన్‌ఛార్జిల నియామకాల విషయంలో బీజేపీ వ్యూహాత్మక ధోరణి ప్రదర్శిస్తోంది. కొన్ని రాష్ట్రాలకు అనుభవజ్ఞులను.. మరికొన్ని రాష్ట్రాలకు దూకుడు స్వభావం ఉన్న వాళ్లను నియమిస్తోంది. ఆ లెక్కనే బండికి ఏదైనా రాష్ట్రం అప్పగిస్తారనే టాక్ నడుస్తోంది. అయితే బండికి ‘బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి’ పదవి దక్కడమనేది ఆయన్ని అభిమానుల్ని ఖుషీ చేసేదే అయినా.. తెలంగాణ రాజకీయాలకూ ఆయన దూరం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం!.
ఇదీ చదవండి: సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే సహా అంతా ఆ పార్టీలోకేనా?
Comments
Please login to add a commentAdd a comment