సాక్షి, మహబూబాబాద్: ‘రాష్ట్రంలోని నాలుకోట్ల మంది ప్రజలు రక్తమాంసాలు కరిగించి, శ్రమించి పన్నులు చెల్లిస్తే రూ.2వేల కోట్లతో ప్రగతిభవన్ కట్టారు. దీనిలోకి రైతులు, కూలీలు, ఉద్యమకారులు, విద్యార్థులు, చివరకు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులకు కూడా ప్రవేశం లేదు. ప్రజలకు ఉపయోగపడని ఆ భవనం గేట్లు బద్దలు కొట్టాలి. పునాదులతో సహా కూల్చేయాలి. ప్రజల సమస్యలను వినే భవన్ కావాలి..’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. హాథ్‌సే హాథ్ జోడో యాత్ర బుధవారం మహబూబాబాద్ జిల్లాలో సాగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో, బహిరంగ సభలో మాట్లాడారు.
తెలంగాణ ద్రోహుల కేంద్రంగా ప్రగతిభవన్
‘గతంలో పనిచేసిన సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల కార్యాలయాలు ప్రజల సమస్యలు, వినతులు తీసుకునే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు తెలంగాణ ద్రోహులు, దగాకోర్లు, మాఫియా, చీకటి ఒప్పందాలకు కేంద్రంగా ప్రగతిభవన్ ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైంది. 2014లో రాష్ట్రాన్ని సాధించింది. ఇప్పుడు 2023లో తెలంగాణలో నియంత పాలన అంతానికి మరో ఉద్యమం వచి్చంది. నాటి ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్‌ను వంద మీటర్ల లోతుకు పాతేందుకు కాంగ్రెస్ దండు కదలాలి..’ అని రేవంత్ పిలుపునిచ్చారు.
కేసీఆర్‌పై కూడా కేసు పెట్టాలి
‘ప్రగతిభవన్‌ను నేలమట్టం చేయాలని చెప్పినందుకు తనపై కేసు పెట్టాలని పోలీసులను ఆశ్రయించిన దద్దమ్మ నాయకులు గతాన్ని తెలుసుకోవాలి. నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని టీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన కేసీఆర్‌పై కూడా కేసు పెట్టాలి. చట్టం అందరికీ సమానమే. నాకో నీతి.. కేసీఆర్‌కో నీతా?..’ అని ప్రశ్నించారు.
ప్రజలు చెప్పిందే మేనిఫెస్టోలో..
‘గతంలో మాదిరిగా ఈసారి కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో ఉత్కంఠ ఉండదు. ఇప్పటికే 50 శాతం అభ్యర్థుల జాబితా తయారు చేశాం. ఇతర పారీ్టల నాయకులు తమకు నచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో పెడతారు. మేం మాత్రం ప్రజలు చెప్పిందే పెడతాం. వారి సమస్యలు తీర్చేలా మేనిఫెస్టో ఉంటుంది. పోడు భూములకు పట్టాలు, పేదలకు ఇళ్లు, పంటలకు గిట్టుబాటు ధర, 317 జీఓ సవరణ తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తాం. అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, ప్రత్యేక నిధులు కేటాయిస్తాం..’ అని రేవంత్ చెప్పారు.
మానుకోటలో దుశ్శాసన పాలన
‘మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఒక రాక్షసుడు. దుశ్శాసన పాలన చేస్తున్నాడు. కలెక్టర్‌ను అవమానపర్చడం, పేదలకు అన్యాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఒక వైపు ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మరోవైపు ఎంపీ కవిత వందల ఎకరాలు పంచుకుంటున్నారు..’ అని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సీతక్క, మల్లురవి, సుదర్శన్‌రెడ్డి, బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇలావుండగా మహబూబాబాద్ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ‘జై బీఆర్‌ఎస్, జై శంకరన్న’ అంటూ నినాదాలు చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేశారు. వారు రేవంత్‌పై చెప్పులు విసిరేసేందుకు యతి్నస్తుండగా అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జరిగినా, అలాంటిదేమీ లేదని పోలీసులు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment