
నగరి: చంద్రబాబు వల్లే భువనేశ్వరికి అపాయం ఉందని, జరగని విషయాన్ని జరిగినట్టు ఏడ్చి నానాయాగి చేశారంటే ఏదో స్కెచ్ వేశాడని అర్థమవుతోందని, జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా సూచించారు. ఆడవారి ఉసురు తగిలినందుకే చంద్రబాబు గత ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమయ్యారన్నారు. ఆడవారిపై అనవసరంగా ఎవరు నోరు పారేసుకుంటారో, ఎవరు కుట్రలు చేసి తొక్కేయాలని చూస్తారో వారి పాపాన వారే పోతారు.. అంటూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. మంగళవారం నగరిలోని తన నివాసం వద్ద రోజా విలేకరులతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు హయాంలో జరిగిన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఎంతో మంది మహిళల జీవితాలు నాశనమయ్యాయి.
వాటిపై అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏడాది పాటు తనను సస్పెండ్ చేసి వేధింపులకు గురిచేసిన ఘటన భువనేశ్వరికి కనిపించలేదా? ఎమ్మార్వో వనజాక్షిని ఇసుక మాఫియా వారు చేయిచేసుకున్నరోజు వారి ఏడుపు ఆమెకు వినిపించలేదా?. రిషితేశ్వరి లాంటి విద్యార్థులు ఎంతో మంది చనిపోయారు. వారి మృతికి గల కారణాలు తెలుసుకోకుండా, బాధ్యులపై కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా తల్లిదండ్రులను కడుపుకోతకు గురిచేసినప్పుడు భువనేశ్వరి ఏంచేస్తున్నారు? గోదావరి పుష్కరాల పేరిట 30 మందిని చంపేసినప్పుడు వారి కుటుంబాల కన్నీరు కనిపించలేదా?’’ అని రోజా ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎన్టీఆర్ ఏడుపునకు కారణమైన వారు ఏవిధంగా నామరూపాలు లేకుండా పోతున్నారో జనం చూస్తూనే ఉన్నారన్నారు. నేడు మహిళలు పూర్తి రక్షణతోనే ఉన్నారని, వారికి అన్నింటా సమాన అర్హత కల్పించి, దిశ లాంటి చట్టాలను ప్రవేశపెట్టి జగన్ అంటే మా అన్న అని మహిళలు చెప్పుకునే విధంగా వారికి ముఖ్యమంత్రి అండగా ఉన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment