సాక్షి, కాకినాడ: వైస్రాయ్ హోటల్‌లో తన తండ్రి మీద చెప్పులు వేసి అవమానించినప్పుడు భువనేశ్వరి ఎందుకు బయటకు రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా ప్రశ్నించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో తాము కొన్న భూములు, హెరిటేజ్‌కు చెందిన చంద్రబాబు కుటుంబం భూముల రేట్లు పడిపోతాయనే టీడీపీ నేతలు ధర్నా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు దిగజారి తన భార్యను రాజకీయ పావుగా వాడుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారమిక్కడ రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు అమరావతిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటే ఎలా నమ్మాలని ప్రజలు అడుగుతున్నారన్నారు.
‘లోకేష్.. ఆయన భార్య నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకొన్నారు? వారెందుకు రాజధాని రైతులకు అండగా లేరు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు... పదవి పోయి ఆయన ఏడ్చినప్పుడు భువనేశ్వరి తన తండ్రిని పరామార్శించలేదు. తన అక్క పురందేశ్వరి.. బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ నుంచి వెలేసినా ఆమె బయటకు రాలేదు. అన్న హరికృష్ణను పార్టీ నుండి గెంటేసి.. అవమానించినా బయటకు రాని భువనేశ్వరి ఈరోజు రాజధాని రైతుల కోసం బయటకు వచ్చి రెండు బంగారు గాజులు ఇచ్చారంటే ఎలా నమ్మాలని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం సెక్రటేరియట్‌లో హుండీలు పెట్టినప్పుడు భువనేశ్వరి గానీ... ఆమె కొడుకు-కోడలు గానీ ఎందుకు డబ్బులు డొనేట్ చేయలేదు’ అని రోజా ప్రశ్నించారు.(బంగారు గాజు రహస్యం!)
అప్పులు చేసి వెళ్లారు..
గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా రాష్ట్రానికి చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారని రోజా మండిపడ్డారు. ‘రాజధాని కోసం స్కూల్ పిల్లల నుండి రూ.10 వసూలు చేసిన చంద్రబాబు... ఎందుకు తన కుటుంబ సభ్యుల నుండి వసూలు చేయలేదు? రైతులను మోసం చేసి భూములు లాక్కున్న చంద్రబాబుకు ఎవరైనా మద్దతు పలుకుతారా. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో కొన్న తమ భూముల కోసం ఇష్యూ చేయడాన్ని చూసి చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారు’ అని విమర్శించారు. ‘రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పులు పెట్టి చంద్రబాబు వెళ్ళిపోయారు. రైతులకు అన్యాయం జరగకుండా వారి భూములు వారికి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటున్నారు. ఈ పరిస్థితిలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ అధికార వికేంద్రీకరణ చేయాలనుకుంటున్నారు. దయచేసి.. చంద్రబాబు తన కుటుంబాన్ని తీసుకువచ్చి వేషాలు వేయొద్దని కోరుతున్నాను’ అని రోజా విఙ్ఞప్తి చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి బయటకు వస్తే భువనేశ్వరికి ఉన్న పరువు కూడా పోతుందని... ఎన్టీఆర్ కూతురన్న గౌరవం ఆమె పోగొట్టుకుంటారని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment