
జైపూర్/న్యూఢిల్లీ : అశోక్ గహ్లోత్ సారథ్యంలోని రాజస్తాన్ సర్కార్‌పై తిరుగుబాటు చేసి రాహుల్, ప్రియాంకలతో భేటీ అనంతరం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన సచిన్ పైలట్ తాజా పరిణామాలపై మంగళవారం పెదవివిప్పారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తనపై చేసిన తీవ్ర వ్యాఖ్యలపైనా స్పందించారు. గహ్లోత్ పలు సందర్భాల్లో పైలట్‌ను నికమ్మ (పనికిరాని నేత)గా అభివర్ణించడంతో పాటు తన సర్కార్‌ను కూలదోసేందుకు బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. తాను తన కుటుంబం నుంచి విలువలను పుణికిపుచ్చుకున్నానని, తాను ఎవరిని ఎంతగా వ్యతిరేకించినా అలాంటి తీవ్ర పదజాలం వాడబోనని స్పష్టం చేశారు. అశోక్ గహ్లోత్ తన కంటే వయసులో పెద్దవారని ఆయనను తాను వ్యక్తిగతంగా గౌరవిస్తానని, అయితే పనికి సంబంధించిన అంశాలు, ఆందోళనలను లేవనెత్తే హక్కు తనకుందని చెప్పుకొచ్చారు.
ప్రజా జీవితంలో లక్ష్మణ రేఖ ఉంటుందని, 20 ఏళ్లుగా తాను ఎన్నడూ లక్ష్మణ రేఖను దాటలేదని చెప్పారు. ప్రజాజీవితంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగత దాడులు, దూషణలు చేసుకోవడం ఎంతమాత్రం అవసరం లేదనే సంప్రదాయాన్ని మనం నెలకొల్పాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయాల్లో సిద్ధాంత వైరుధ్యాలున్నా వ్యక్తిగత విభేదాలకు తావులేదని పైలట్ వ్యాఖ్యానించారు. కాగా గహ్లోత్ సర్కార్‌పై సచిన్ పైలట్ తిరుగుబాటు అనంతరం పైలట్‌ను డిప్యూటీ సీఎం పదవితో పాటు పీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ పార్టీ తొలగించింది. ఇక రాహుల్, ప్రియాంకల సమక్షంలో జరిగిన చర్చల అనంతరం 18 మంది ఎమ్మెల్యేలతో సహా తిరిగి పార్టీ గూటికి చేరేందుకు పైలట్ అంగీకరించడంతో రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది.