బద్వేలులో విజయం మాదే  | Sajjala Ramakrishna Reddy Comments On Badvel Bypoll And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

బద్వేలులో విజయం మాదే 

Published Wed, Sep 29 2021 4:47 AM | Last Updated on Wed, Sep 29 2021 7:16 AM

Sajjala Ramakrishna Reddy Comments On Badvel Bypoll And Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: బద్వేల్‌ ఉప ఎన్నికలో ఆనవాయితీని గౌరవించి ప్రతిపక్షాలు పోటీపెట్టకపోతే ఆహ్వానిస్తామని.. ఒకవేళ పెట్టినా తమకెలాంటి అభ్యంతరంలేదని.. అదే జరిగితే విజయం వైఎస్సార్‌సీపీదేనని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా ఎమ్మెల్యేలు దురదృష్టవశాత్తూ మరణిస్తే.. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. బద్వేల్‌ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్‌ దాసరి సుధ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేస్తారని సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే ప్రకటించారన్నారు.

పోటీ అనివార్యమైతే ఉప ఎన్నికను వైఎస్సార్‌సీపీ సీరియస్‌గా తీసుకుని పనిచేస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మీద, సీఎం వైఎస్‌ జగన్‌ మీద ప్రజల్లో అభిమానం తగ్గడానికి ఎలాంటి అవకాశం లేకపోగా.. మరింతగా పెరిగిందనడానికి 2019 నుంచి ఇప్పటివరకూ జరిగిన వరుస ఎన్నికల ఫలితాలే నిదర్శనమని గుర్తుచేశారు. ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం తమకూ అవసరమని సజ్జల చెప్పారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు భయోత్పాతం సృష్టించి.. డబ్బుల్ని వెదజల్లారని.. ఇప్పుడూ అలాగే చేస్తే వారి ఆగడాలను అడ్డుకుంటామని తెలిపారు.  రెండేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు.. 95 శాతం హామీల అమలును ప్రజలకు వివరిస్తామన్నారు.  

ఆన్‌లైన్‌ టికెటింగ్‌ను అందరూ హర్షిస్తున్నారు 
ప్రభుత్వం తీసుకొస్తున్న ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంపై సినీ పరిశ్రమలోని అందరూ హర్షిస్తున్నారని సజ్జల చెప్పారు. ఈ విధానాన్ని అమలుచేయడానికి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయన్నారు. బాహుబలి సినిమాకు మొదటి వారంలో 50శాతమే టికెట్లు బుక్‌ అయినట్లు చెబుతున్నారని.. నిజంగా అదే జరిగితే ఇంతకన్నా ఘోరం ఇంకేదైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. తొలివారంలోనే ఆ సినిమాకు థియేటర్లు నిండలేదంటూ మోసం చేశారని.. లెక్కలు కూడా చూపలేదన్నారు. దీనివల్ల కష్టపడి సినిమా తీసిన నిర్మాతలు నష్టపోతున్నారని.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతోందన్నారు. ఈ అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని తెస్తున్నామన్నారు. సినిమాకు ఏ రోజు వచ్చిన కలెక్షన్‌లో వాటాలు ఆ రోజే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, థియేటర్‌ యజమానుల ఖాతాల్లో ఆటోమేటిక్‌గా జమ అవుతాయని.. ప్రభుత్వం ఈ విషయంలో కేవలం ఫెసిలిటేటర్‌ పాత్ర మాత్రమే పోషిస్తుందని ఆయన స్పష్టంచేశారు. 

అపోహలు సృష్టిస్తోంది దోపిడీదారులే 
ఒకప్పుడు ఎన్టీఆర్‌ నుంచి కాంతారావు, రాజబాబు వరకూ ఏ సినిమాకైనా టికెట్‌ ధర ఒకేలా ఉండేదని.. ఇటీవల కాలంలో సినిమా విడుదలైన మొదటి వారంలో రూ.వంద టికెట్‌ను రూ.వెయ్యికి అమ్ముకుని.. అటు ప్రజలను ఇటు ప్రభుత్వాన్ని దోపిడీ చేస్తున్నారని.. అలాంటి వారే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంపై అపోహలు సృష్టిస్తున్నారని వివరించారు. తక్కువ ఖర్చులో ప్రజలకు వినోదాన్ని అందించాలన్నదే తమ విధానమన్నారు. ఎవరైతే పారదర్శకంగా ఉండాలనుకుంటారో వారంతా ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తారని.. దోపిడీదారులే వ్యతిరేకిస్తారని చెప్పారు. చంద్రబాబులా నలుగురు సినీ పెద్దలను పిలిపించి.. ఫొటోలకు ఫోజులిచ్చి జాతీయ మీడియాలో హైలెట్‌ అయ్యేలా సీఎం జగన్‌ షో చేయరని మరో ప్రశ్నకు సమాధానంగా సజ్జల చెప్పారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంపై ఎటువంటి అనుమానాలున్నా సినీ పెద్దలు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలవొచ్చునని చెప్పారు.   

స్వార్థం కోసమే పవన్‌ విమర్శలు
‘సినిమాలు, రాజకీయాల్లో రెండు గుర్రాలపై స్వారీచేస్తున్న పవన్‌ కల్యాణ్‌ తన స్వార్థం కోసమే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. కానీ, ఆ బురద ఆయనపైనే పడింది. పవన్‌ వ్యాఖ్యలను సినీ పరిశ్రమ పెద్దలే వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు.. ఆయన పెద్ద గుదిబండగా మారారని వారు భావిస్తున్నారు’.. అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సజ్జల బదులిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement