
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని అన్నారు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్‌పై జరిగిన దాడిని భద్రతా వైఫల్యం అంటున్న టీడీపీ నేతలు, ఏం వైఫల్యమో చెప్పడం లేదని మండిపడ్డారు. ఎక్కడ నింద తమపైకి వస్తుందోనని టీడీపీ భయపడుతోందన్నారు. ఎవరైనా వారిపై వారే దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో అడ్రస్ గల్లంతవుతుందని భయపడుతున్నారన్నారు.
సీఎంపై జరిగిన దాడిపై ప్రతిపక్షాలన్నీ ఒకేలా మాట్లాడుతున్నాయన్నారు సజ్జల. సీఎంపై దాడి జరిగితే డ్రామా అనడం సరికాదని హితవు పలికారు. వైఎస్ జగన్‌కు నాటకాలు, డ్రామాలు అడటం రాదని తెలిపారు. చంద్రబాబు దాడిని ఖండిస్తున్నామంటూనే డ్రామాలు అంటున్నారని మండిపడ్డారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో పవన్‌కే అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.
‘ప్రతిపక్షాలకు పుట్టగతులుండవని అర్థమైంది. డ్రామాలాడేవారైతే గాయాన్ని ప్రజలకు చూపించేవారు. గతంలో గానీ, ఇప్పుడు గానీ జనాలకు గాయాన్ని చూపించలేదు. డ్రామాలంటున్న వారెవరైనా రాయితో కొట్టించుకోగలారా? విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రతిపక్షాలు ప్రయతిస్తున్నారు. పవన్ కత్తితో పొడిపించుకుంటాడా? రాయితో కొట్టించుకుంటాడా? ప్రతిపక్షాల విమర్శలను వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నాం’ అన్నారు సజ్జల