సాక్షి, గుంటూరు: గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీకి గుడ్‌బై ప్రకటించడంపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని.. యార్లగడ్డ మాటలు చూస్తుంటే ఆయన ముందే నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు.
శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేయాలి. అవకాశం కోసం ఎదురు చూడాలి. ఎవరిని అవమానించడం.. బాధించడం అనేది ఉండదు. ఏ పార్టీలోనైనా ఇలాంటివి సహజం. ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. ఏ పార్టీలోనైనా ఆరోగ్యవంతమైన వాతావరణం ఉండాలనే కోరుకుంటాం. సమస్యలుంటే అంతర్గతంగా మాట్లాడాలే తప్పా.. వేదికలపై ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు.
‘‘యార్లగడ్డ గతంలో మాపార్టీ నుంచి పోటీ చేశారు. టికెట్ ఆశించేవాళ్లు ఎంతమంది ఉన్నా టికెట్ ఒకరికే వస్తుంది. ఆ విషయమే నేను యార్లగడ్డ కి చెప్పాను. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే పార్టీలో మాట్లాడవచ్చు. కానీ, పబ్లిక్ గా మీడియాతో మాట్లాడతానంటే ఎలా?. వరుసగా మీటింగులు పెట్టి అలా మాట్లాడుతున్నారు. ముందే పార్టీ మారాలనే ఇలా మాట్లాడుతున్నారేమో?. ఎమ్మెల్యే టికెట్ రాకపోతే నిరాదరణ అయినట్టు కాదు. సీఎంని కలవాలని ఆయన అనుకుంటే ప్రాపర్ వేలో కలవచ్చు. లేదా నాయకులను కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు. అలా కాకుండా మీడియా ద్వారా మాట్లాడతానంటే అది కరెక్టు కాదు.’’
పార్టీ కోసం పని చేసేవారికి గుర్తింపు ఉంటుంది. బలమైన పార్టీ కాబట్టి చాలామంది భవిష్యత్తును ఆశిస్తారు. కానీ, ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని సజ్జల తెలిపారు. యార్లగడ్డ ఎపిసోడ్‌లో మీడియా వక్రీకరించిన దాఖలాలు ఉన్నాయని సజ్జల ప్రస్తావించారు. యార్లగడ్డను నేను అవమానించినట్లు కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. యార్లగడ్డను పోతేపోనీ అని నేను అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అలా నేను ఎందుకు అంటాను. నేనే కాదు మా పార్టీలో ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేయరు. యార్లగడ్డను ఎవరూ అవమానించలేదు. యార్లగడ్డకు మంచి భవిష్యత్తు ఉంటుందని నా వాళ్లు చెప్పారు అని సజ్జల చెప్పారు.
పవన్, చంద్రబాబు ఒక్కటే ఆర్కెస్ట్రా
సీఎం జగన్‌ను గద్దె దించడమే లక్ష్యమని పవన్ చెబుతూ వస్తున్నాడు. దీనికోసం పవన్ ఎవరితోనైనా కలుస్తారు. చంద్రబాబు ఏం చెబితే అది పవన్ చేస్తారు. పవన్, చంద్రబాబు ఎప్పుడూ కలిసే ఉన్నారు. పవన్ కల్యాణ్ ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా టీడీపీ, జనసేన కలిసే ఉన్నాయి. చంద్రబాబుకు ఆర్కెస్ట్రా లాగా పవన్ వ్యవహరిస్తున్నారు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించాం కాబట్టి.. సీఎం జగన్ వైజాగ్ వెళ్తున్నారు కాబట్టి.. పవన్ ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు చంద్రబాబు పాలనకు సరిగ్గా సరిపోతుంది. విశాఖలో క్రైం పెరిగిందంటూ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారు ఎన్ని చేసినా అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పని చేస్తుంది.
పిట్టలదొరల్లాగా..
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గం ప్రశాంతంగా బతకలేదు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రజలకు ఏం ఏశారు?. చంద్రబాబు విజనరీలాగ మాట్లాడుతున్నారా?. ఇలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఈ రాష్ట్రం ఏం కావాలి?. సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ తానే కనిపెట్టానంటుంటే ఆయన మానసిక స్థితి ఏంటి?. ఈయన్ని సీఎం సీట్లో కూర్చోపెట్టాలనుకునే పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటి?. అసలు వీరిని పగటివేషగాళ్లు అనాలా? ప్రతిపక్ష నేతలు అనాలా?. పిట్టలదొరలు లాగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా.. సంక్షేమ పథకాలను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. ఆ ఫలితం రేపు ఎలక్షన్లలో కనిపిస్తుంది అని సజ్జల విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఓ ముసలి నక్క ఆంధ్రజ్యోతిలో అవాస్తవాలు రాయిస్తోంది!
Comments
Please login to add a commentAdd a comment