సాక్షి, హైదరాబాద్: పార్టీ బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే..రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్‌కు రెండు, బీఆర్‌ఎస్‌కు ఒకటి కచ్చితంగా దక్కుతాయి. వచ్చే మార్చిలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్‌లు రిటైర్ అవుతున్నారు. వీరిస్థానంలో ఇద్దరు కాంగ్రెస్ నుంచి, ఒకరు బీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప అటు అధికారపక్షంగానీ, ఇటు ప్రతిపక్షంగానీ రాజ్యసభ స్థానాల కోసం పోలింగ్ వరకూ వెళ్లేందుకు సిద్ధపడే పరిస్థితుల్లేవు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా రాష్ట్రంలోని రాజకీయపార్టీల సర్దుబాటు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదని, ప్రస్తుత అసెంబ్లీలో పార్టీల కాంబినేషన్ ప్రయోగాలకు సరిపోదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాలుగో అభ్యర్థిని బరిలో దింపితే మాత్రం రాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడినట్టే.
రాజ్యసభ సభ్యుల కోటా ఓట్ల లెక్క ఇది
♦ రాజ్యసభ ఎన్నికల కోటా ఓట్లను (ఒక అభ్యర్థి గెలవడానికి అవసరమైనవి) ఎన్నికల నిర్వహణ నిబంధనలు–1961లోని 76వ నిబంధన ప్రకారం ఒక ఫార్ములాతో నిర్ధారిస్తారు. ఈ ఎన్నిక కోసమే రూపొందించిన ఫార్ములా ప్రకారం అసెంబ్లీలో సభ్యుల మొత్తంసంఖ్య కీలకం. ఈ సంఖ్యను ఎన్నికలు జరగాల్సిన రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉంటే దానికి ఒకటి కలిపి ఆ సంఖ్యతో భాగిస్తారు. భాగించగా వచ్చిన ఫలితానికి ఒకటి కలుపుతారు. అప్పుడు కోటా సంఖ్య నిర్ధారణ అవుతుంది.
♦ ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో 119 మంది సభ్యులున్నారు. మార్చిలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. పై ఫార్ములా ప్రకారం 119ని నాలుగుతో భాగించాలి. అలా భాగించగా వచ్చే భాగఫలంలోని డెసిమల్స్‌ను పరిగణనలోకి తీసుకోరు. అప్పుడు 29 వస్తుంది. ఆ 29కి 1 కలుపుతారు. అప్పుడు ఒక్కో సభ్యుడు ఎన్నిక కావాల్సిన కోటా (గెలవడానికి అవసరమయ్యే ఓట్ల సంఖ్య) 30గా నిర్ధారణ అవుతుందన్నమాట. ఈ 30 ఓట్ల విలువను మాత్రం 100తో హెచ్చించి లెక్కకడుతారు. దీన్ని బట్టి మార్చిలో జరిగే మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో ఒక్క సభ్యుడు గెలవాలంటే కనీసం 30 ఓట్లు రావాలన్నమాట.
♦ ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 64 మంది సభ్యుల బలం ఉంది. మిత్రపక్షమైన సీపీఐకి ఒక సభ్యుడున్నారు. ఈ కూటమికి కచ్చితంగా రెండు స్థానాలు దక్కుతాయి. బీఆర్‌ఎస్‌కు 39 మంది సభ్యులున్నారు. ఈ పార్టీకి కూడా కచ్చితంగా ఒక స్థానం దక్కుతుంది. మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ, నాలుగో నామినేషన్ పడితే మాత్రం ఎన్నికలు జరుగుతాయి.
అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం 10 మంది సభ్యులు అభ్యర్థిని ప్రతిపాదించాలి. ఈ లెక్కన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మాత్రమే అభ్యర్థులను పోటీలో నిలిపే అవకాశాలున్నాయి. 8 మంది సభ్యులున్న బీజేపీ, ఏడుగురి బలం ఉన్న ఎంఐఎం, ఒక్క సభ్యుడు ఉన్న సీపీఐలు తమంతట తాముగా అభ్యర్థిని బరిలో నిలపలేవు.
♦ ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. మూడు స్థానాలకు ముగ్గురే నామినేషన్లు వేస్తే కోటాతో పనిలేదు. ఆ ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. అలా కాకుండా ముగ్గురి కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేసి పోలింగ్ జరిగితే మాత్రం ఈ పద్ధతిలో కోటా ఓట్లను లెక్కించి అవసరమైన మేర ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు.
మొత్తం 119 సభ్యుల్లో ఎవరైనా పోలింగ్‌కు గైర్హాజరై ఓటు హక్కు వినియోగించుకోకపోతే అప్పుడు కోటా సంఖ్యలో మార్పు వస్తుంది. అప్పుడు అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్యకు బదులు ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్యను కీలకంగా తీసుకుని దాని ప్రకారం కోటా నిర్ధారించి ఆ మేరకు ఓట్లు సాధించిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు.
♦ ఒకవేళ ఎవరైనా ఇద్దరు అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఓట్లు వస్తే మాత్రం రెండో ప్రాధాన్యత ఓటు ప్రకారం విజేతగా నిర్ణయిస్తారు. అప్పటికీ విజేత నిర్ధారణ కాకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుని ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఓటు విలువ తగ్గుతూ వస్తుంది. శాసనమండలి ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాను పాటిస్తారు.
♦ ఒకవేళ పోలింగ్ జరిగితే మూడు స్థానాలు గెలిచేందుకు అవసరమైన కోటా ఓట్లు 90 పోగా, కాంగ్రెస్–4, బీఆర్‌ఎస్–9, ఎంఐఎం–7, బీజేపీ–8, సీపీఐ–1 చొప్పున ఓట్లు మిగులుతాయి. ఈ కాంబినేషన్‌లో ఓట్లు కలిసే అవకాశమే లేదని, బీజేపీ ఓటింగ్‌కు గైర్హాజరు అయినా కోటా సంఖ్య 28 అవుతుందని, అప్పుడు కూడా కాంబినేషన్ కుదరదని, ఎంఐఎం బీఆర్‌ఎస్ వైపు నిలిచినా నాలుగో అభ్యర్థి గెలిచే అవకాశం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపకుండా ముగ్గురిని ఏకగ్రీవం చేసు కునేందుకే అధికార, ప్రతిపక్షాలు మొగ్గుచూపు తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment