కేజ్రీవాల్‌ అరెస్టుకు కుట్ర: శరద్ పవార్ | Sharad Pawar On Arvind Kejriwal Arrest Threat, Accuses Centre Of Misusing Power - Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ది క్లీన్ ఇమేజ్.. అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదు: శరద్ పవార్

Published Fri, Jan 5 2024 7:34 AM | Last Updated on Fri, Jan 5 2024 10:29 AM

Sharad Pawar On Arvind Kejriwal Arrest Threat - Sakshi

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. తమ అనుకూల రాజకీయ అభిప్రాయాలు లేని వారిని నిరుత్సాహపరిచేందుకు కేంద్రం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కేజ్రీవాల్ అరెస్టుకు కుట్ర జరుగుతోందని అన్నారు.

పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పవార్ మాట్లాడుతూ.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ సమన్లు పంపిందని అన్నారు. ఆయనను కూడా అరెస్టు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ప్రజలు కేజ్రీవాల్‌ను అధికారంలోకి తెచ్చారని గుర్తుచేసిన శరద్ పవార్.. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులను జైలులో పెట్టారని అన్నారు. కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని పవార్ అన్నారు. 

"ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సిందిగా కేజ్రీవాల్‌కు వరుస నోటీసులు జారీ చేస్తున్నారు. ఆయన దేశ రాజధానికి రెండుసార్లు వరుస ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉందని ఢిల్లీలోని ప్రతీ సాధారణ వ్యక్తికి తెలుసు. అయినా.. ఆయన అరెస్టుకు కుట్ర జరుగుతోంది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదు" అని పవార్ పేర్కొన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటికి మూడుసార్లు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. కానీ ఆయన గౌర్హాజరయ్యారు. వివిధ కారణాలను చూపుతూ ఈడీ ముందుకు హాజరుకాలేదు. దీంతో ఆయన్ను ఈడీ అరెస్టు చేస్తుందని ఆప్ నేతలు గురువారం వరుస ట్వీట్లు చేశారు. కేజ్రీవాల్ అరెస్టు ఖాయమని వార్తలు రావడంపై ఈడీ కూడా స్పందించింది. అలాంటిదేమీ లేదని తెలిపింది. కేజ్రీవాల్‌కు మరోసారి సమన్లు జారీ చేస్తామని తెలిపారు. 

ఇదీ చదవండి: మమతా బెనర్జీపై అధీర్ రంజన్ చౌధరి కీలక వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement