తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేరళలోని తిరువనంతపురం పార్లమెంట్ స్థానంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ముందు డిబేట్ విషయంలో అక్కడ పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు బహిరంగ సవాల్‌ను విసురుకున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ తనతో చర్చకు రావాలని కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ శశి థరూర్‌కు ఛాలెంజ్ చేశారు. దీంతో ఆయన సవాల్‌ను స్వీకరించారు శశి థరూర్.
‘తిరువనంతపురం అభివృద్ధి, పలు ఆలోచనల గురించి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌తో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. ఆయనకు ఈ నియోజకవర్గంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇదే విషయాన్ని నేను మొదటి నుంచి చెబుతున్నా. రాజకీయాలపై చర్చిద్దాం’అని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ.. ‘ రాజీవ్ చంద్రశేఖర్ డిబేట్ సవాల్‌ను నేను స్వాగతిస్తున్నా. అయితే ఇప్పటివరకు చర్చకు రాకుండా ఎవరు తప్పించుకు తిరుగుతున్నారో తిరువనంతపురం సెగ్మెంట్ ప్రజలకు తెలుసు. తిరువనంతపురం రాజకీయాలు, అభివృద్ధిపై చర్చిద్దాం’అని తెలిపారు.
‘ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి, మతతత్వం,పదేళ్ల బీజేపీ పాలనలో రాజకీయాల్లో పెంచిన ద్వేషం. అదే విధంగా గత 15 ఏళ్లుగా కళ్లముందు కనిపిస్తున్న తిరువనంతపురం అభివృద్ధిపై చర్చిద్దాం’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. కేరళలో కీలకస్థానమైన తిరువనంతపురంలో యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా శశి థరూర్ పోటీ చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ఆయన ఓటర్లుకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. వాటిని శశి థరూర్ టీం తీవ్రంగా ఖండించింది. ఆయన అటువంటి పనులు ఎప్పుడు చేయలేదని స్పష్టం చేశారు.
మరోవైపు బీజేపీ అభ్యర్థి అయిన రాజీవ్ చంద్రశేఖర్‌పై యూడీఎఫ్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయన తన నామినేషన్ పత్రాల్లో నకిలీ అఫిడవిడ్ దాఖల చేశారని ఆరోపణులు చేశారు. ఇక్కడ వీరితో పాటు సీపీఐ పార్టీ తరఫున దిగ్గజ నేత పన్నియం రవీంద్రన్ పోటీ చేస్తున్నారు. కేరళలో మొత్తం 20 స్థానాల్లో ఒకే దశలో ఏప్రిల్ 26 పోలింగ్ జరగ్గా.. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment