భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ శనివారం రణరంగంగా మారింది. చర్చ జరపకుండా ఒడిశా లోకాయుక్త సవరణ బిల్లును సభ ఆమోదించడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. తమకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వని స్పీకర్ పాత్రోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోడియం వైపు చెప్పులు, కాగితం ఉండలు, మైక్రోఫోన్‌లను విసిరారు. దాంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని, తక్షణమే వారు సభను వీడి వెళ్లాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను, షెడ్యూల్ కన్నా ఐదు రోజుల ముందే, నిరవధికంగా వాయిదా వేశారు. మధ్యాహ్న భోజన విరామానికి ముందు, ఎలాంటి చర్చ జరపకుండానే లోకాయుక్త సవరణ బిల్లును ఆమోదించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది.
మరోవైపు, మైనింగ్ కార్యకలాపాల్లో అవినీతిపై చర్చ జరపాలన్న తమ డిమాండ్‌ను స్పీకర్ తోసిపుచ్చడంతో కాంగ్రెస్ సభ్యులు కూడా వారితో జత కలిశారు. బీజేపీ సభ్యులు మైక్రోఫోన్‌లను లాగి, తమ ముందున్న కాగితాలను ఉండలుగా చుట్టి స్పీకర్ పోడియం వైపు విసిరారు. చివరకు స్లిప్పర్లను కూడా విసిరారు. అవి స్పీకర్ పోడియం దగ్గరలో పడ్డాయి. గందరగోళం నెలకొని, సభ అదుపు తప్పిన పరిస్థితులో స్పీకర్ పాత్రో సభను వాయిదా వేశారు.
లంచ్ అనంతరం తిరిగి సమావేశమైన తరువాత, అసెంబ్లీలో బీజేపీ ఉపనాయకుడు బీసీ సేథీ, పార్టీ విప్ మోహన్ మాఝీ, ఎమ్మెల్యే జేఎన్ మిశ్రాలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం, వారు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిపారు. ఆర్థిక మంత్రి నిరంజన్ పూజారి కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టిన అనంతరం, సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఒడిశా అసెంబ్లీలో బీజేపీకి 22 మంది ఎమ్మెల్యేలున్నారు. ‘మా వాళ్లు తప్పేం చేయలేదు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో అలా చేశారు’ అని బీజేపీ నేత పీకే నాయక్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment