సాక్షి, ఖమ్మం : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పొత్తు కోసం వామపక్ష పార్టీలకు కాంగ్రెస్ ప్రాధాన్యమిస్తోంది. తాజాగా సీపీఐతో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ సీపీఎంపైనా దృష్టి సారించింది. సీట్ల విషయంలో అలిగి సొంతగా అభ్యర్థులను ప్రకటించిన సీపీఎంతో పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏ రేంజ్‌లో అంటే ఏకంగా ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీయే ఈ విషయమై రంగంలోకి దిగారు.
తెలంగాణ ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు కోసం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సోమవారం సోనియా గాంధీ ఫోన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎంకు రెండు ఎంఎల్ సీ పదవులు ఇస్తామని సోనియా ఆఫర్ చేశారు. పొత్తుకు సహకరించాలని కోరారు. ఇండియా కూటమి తరహాలోనే తెలంగాణలో కలిసి పని చేద్దాం అని రిక్వెస్ట్ చేశారు.
సోనియా ఫోన్ వచ్చిన వెంటనే సీతారాం ఏచూరి, సీపీఎం తెలంగాణ స్టేట్ సెక్రటరీ తమ్మినేని వీరభద్రంకు ఫోన్ చేశారు. సోనియా ఫోన్ గురించి చెప్పారు. అయితే రాష్ట్రంలో సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తుందని తమ్మినేని ఏచూరికి స్పష్టం చేశారు. మిర్యాలగూడెం, వైరా సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్‌తో చర్చలు లేవని తేల్చి చెప్పారు. పొత్తులో భాగంగా సీపీఐకి ఇచ్చినట్టుగా ఒక్క సీటు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రతిపాదనను తెలంగాణ సీపీఎం ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ తీరు సరిగా లేదు..తమ్మినేని
కాగా, ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, రేపు కోదాడ అభ్యర్థిని ప్రకటిస్తామని సీపీఎం స్టేట్ సెక్రటరీ తమ్మినేని వీరభద్రం సోమవారం ఉదయం తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన 17 సీట్ల తో పాటు మునుగోడు ,ఇల్లందు స్థానాలకు పోటీ చేయాలని ఆలోచన ఉందన్నారు. పొత్తులపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని విమర్శించారు. జానారెడ్డి, భట్టివిక్రమార్క ఫోన్ చేస్తే ఇదే చెప్పానన్నారు. ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు ఇవ్వకుండా పొత్తు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పొత్తుల కోసం తాము వెంపర్లాడడం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment