రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. టీఎంసీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో అనేక విశేషాలు చోటు చేసుకున్నాయి.
బహరంపూర్ నుంచి పార్టీ అభ్యర్థిగా టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ (Yusuf Pathan), కృష్ణానగర్ నుంచి మాజీ ఎంపీ మహువా మొయిత్రా బరిలో నిలిచారు. మమత బెనర్జీ మేనల్లుడు, వారసుడు అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నుంచి పోటీ చేయనున్నారు. నటుడు శత్రుఘ్న సిన్హా అసన్సోల్ నుంచి పోటీలో దిగనున్నారు. అయితే సందేశ్‌ఖాలీ వివాదం కారణంగా నుస్రత్ జహాన్‌ను బసిర్హాట్ స్థానం నుంచి తప్పించి ఆ స్థానంలో హాజీ నూరుల్ ఇస్లామ్‌ను బరిలోకి దింపారు.
మాజీ భర్తపై పోటీ
తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో మరో ఆసక్తికర పరిణామం ఏంటంటే.. బిష్ణుపూర్ స్థానం నుండి సుజాత మోండల్ ఖాన్ (Sujata Mondal Khan) తన మాజీ భర్త, సిట్టింగ్ బీజేపీ ఎంపి సౌమిత్ర ఖాన్‌పై పోటీ చేస్తున్నారు. మొదట్లో వీరిద్దరూ బీజేపీలోనే ఉండేవారు. సుజాత మోండల్ ఖాన్ 2020లో బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.
అలా పార్టీలో చేరిన కొన్ని గంటలకే సౌమిత్రా ఖాన్ ఆమెకు విడాకుల నోటీసు పంపారు. ఈ ఘటనతో అప్పట్లో ఆమె పేరు వార్తల్లో ప్రముఖంగా వచ్చింది. 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సుజాత మోండల్ తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఆరాంబాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment