జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఓటమి భయం పట్టుకుందా?.. తాజా పరిణామాలన్నీ అవుననే చెబుతున్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేయడంపై జనసేనాని తర్జనభర్జన పడుతున్నారు. తొలుత అక్కడి నుంచే బరిలో నిల్చుంటానని ప్రకటించి.. రెండ్రోజులు గడవక ముందే ప్లేట్ ఫిరాయించాడు. వరుసగా తగులుతున్న షాక్ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేస్తాననే సాకు చూపించి అక్కడి నుంచి బయటపడాలని చూస్తున్నారు.
పిఠాపురంలో మారిన సమీకరణాలు..
పవన్ వ్యవహార శైలి కారణంగా పిఠాపురంలో జనసేనకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక కాపు నేతలందరూ జనసేనను వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. తాజాగా పిఠాపురం జనసేన మాజీ ఇన్‌చార్జ్ మాకినీడు శేషు కుమారి వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శేషుకుమారి పిఠాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె 28వేల ఓట్లు సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు సిద్దాంతం లేదు.. నిబద్దత లేదు. జనసేనకి విధివిధానాలు లేవని మండిపడ్డారు.
వర్మ వార్నింగ్..
మరోవైపు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ముందు నుంచి పిఠాపురంలో బలమైన నేతగా ఉన్నారు. ఈసారి పిఠాపురం టికెట్ తనకే వస్తుందనే ఆశ పెట్టుకున్నారు. కానీ, కూటమి పొత్తులో భాగంగా పిఠాపురంలో పవన్ పోటీ చేస్తానని ప్రకటించడంతో వర్మ, ఆయన మద్దతుదారులు చంద్రబాబు, పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చంద్రబాబు మంతనాల కారణంగా వర్మ కాస్తా చల్లబడ్డారు. కానీ, తాజాగా వర్మ మరో బాంబు పేల్చారు. పిఠాపురంలో పవన్ తప్ప వేరెవరొచ్చినా పల్లకీ మోయనంటూ వర్మ తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తేనే సహకరిస్తానన్నారు. ‘వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా.. పవన్ ఎంపీగా వెళ్తే నన్ను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు’ అని వర్మ ట్విస్ట్ ఇచ్చారు.
వంగా గీత కౌంటర్..
పిఠాపురం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత.. పవన్‌కు కౌంటరిచ్చారు. పవన్ నన్ను జనసేనలోకి రావాలని కోరుతున్నారు. నేను కూడా పవన్ ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాను 2009 కంటే ముందే రాజకీయాల్లో ఉన్నానని.. చిరంజీవి గుర్తించి ప్రజారాజ్యంలోకి ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌వి అన్నీ దింపుడు కల్లం ఆశలే. పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు’ అని అన్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి సీనియర్ నేత చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. ఇక, పవన్ తీరుతో విసుగెత్తి ముద్రగడ పద్మనాభం కూడా వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. పవన్ వ్యవహారశైలి, నాయకత్వ లక్షణాలపై నమ్మకం కోల్పోయిన గోదావరి జిల్లా కాపులు ఒక్కొక్కరుగా సీఎం జగన్ మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్నారు. దీంతో, పవన్‌కు కొత్త టెన్షన్ పట్టుకుంది.
పవన్ కొత్త స్టోరీ..
ఈ పరిణామాల నేపథ్యంలో ఓటమి భయంతో పవన్ ఓ కొత్త స్టోరీ చెబుతున్నారు. ఒక వేళ అమిత్‌షా చెప్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ తెలిపారు. తాను ఎంపీగా పోటీ చేస్తే.. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారని పవన్ చెప్పారు. దీంతో, జనసైనికులు తలలు పట్టుకున్నారు. మరోవైపు అక్కడి పోటీ అభ్యర్థి వంగా గీతతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలంతా పవన్‌ను ఏకిపారేస్తున్నారు. అసెంబ్లీకి పోటీ చేయాలంటే చంద్రబాబు, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలా?.. ఓ పార్టీ అధ్యక్షుడివి అయ్యి ఉండి ఇదేం ఖర్మ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించుకున్న పవన్.. ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళ్తానంటున్నారు. ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా?.. ఓటమి భయంతోనే పవన్ ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తున్నారా? ఏది ఏమైనా ఆయన ఇస్తున్న వరుస ప్రకటనలు జనసేన వర్గాలకు అస్సలు సహించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment