తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, చెన్నై: ఆరోగ్యశాఖను తన భుజస్కంధాలపై మోస్తున్న మంత్రే తనకు ఉన్న బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలను గుర్తు చేస్తూ ప్రచారంలో పడడం సర్వత్రా విస్మయంలోకి నెట్టింది. పుదుకోట్టై జిల్లా నుంచి విరాళిమలై నుంచి విజయభాస్కర్ ఇప్పటికే రెండు సార్లు గెలిచారు. ఆరోగ్య మంత్రిగా అత్యధిక సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి విజయభాస్కర్. కరోనా కాలంలో ఆయన సేవలు ప్రశంస నీయం. తాజాగా అదే విరాళిమలై నుంచి మళ్లీ పోటీలో విజయభాస్కర్ ఉన్నారు. అయితే, సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఆయన తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు విస్మయానికి దారి తీసింది. తనకు బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయని, తనను ఆదరించాలన్నట్టు ఆయన ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
దీనిపై వ్యంగ్యాస్త్రాలు, సెటైర్లు వేసే వాళ్లు పెరిగారు. దీంతో గురువారం విజయభాస్కర్ ఓ మీడియాతో మాట్లాడుతూ, వివరణ ఇచ్చుకున్నారు. తానేమీ సెంటిమెంట్‌తో ఓట్ల కోసం పాకులాడడం లేదన్నారు. వాస్తవిక జీవితంలో తనకు ఉన్న సమస్యలను గుర్తు చేయడంలో తప్పులేదన్నారు. ఈ నియోజకవర్గంలో తాను అడగాల్సిన అవసరం లేదని, తన ముఖం కనిపిస్తే చాలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్లు ఎక్కువేనని పేర్కొన్నారు. తాను ఏ మేరకు సేవల్ని అందించానో వివరిస్తూ ఓ చోట చేసిన ప్రసంగాన్ని వక్రీకరించినట్టు పేర్కొన్నారు. వాస్తవిక జీవితంలో వి శ్రాంతి లేకుండా సేవల్ని అందించానని, అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ చోట బీపీ, షుగర్ గురించి మాట్లాడనే గానీ, ఇందులో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. ఈ ప్రచారం పుణ్యమా అని ఆరోగ్యమంత్రి అనారోగ్య మంత్రయ్యాడంటూ వ్యంగ్యాస్త్రాలు హోరెత్తడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment