బూతు పురాణం | TDP Attacks on YSRCP leaders and media representatives | Sakshi
Sakshi News home page

బూతు పురాణం

Published Wed, Oct 20 2021 2:55 AM | Last Updated on Wed, Oct 20 2021 10:50 AM

TDP Attacks on YSRCP leaders and media representatives - Sakshi

పట్టాభి అనుచిత వ్యాఖ్యలపై విశాఖలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీద కర్రతో దాడి చేస్తున్న టీడీపీ నాయకుడు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్వేషాల చిచ్చు రగిలించి రాజకీయంగా చలి మంట కాచుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రకు తెరతీశారు. అందుకోసం ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు పన్నాగం పన్నారు. దేశంలో ఎక్కడాలేని రీతిలో చంద్రబాబు ‘బూతు పురాణం’ కుట్రను రచించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. అయ్యన్నపాత్రుడు, ధూళిపాళ్ల, నక్కా ఆనంద్‌బాబు, పట్టాభి తదితరులు పాత్రధారులుగా సూత్రధారి చంద్రబాబు ఈ కుతంత్రాన్ని అన్నీ తానై నడిపించారు. నిరాధార ఆరోపణలతో మొదలైన కుట్ర.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను అసభ్యకరంగా దూషించడం ద్వారా తారా స్థాయికి తీసుకువచ్చారు. ముందుగానే మోహరించిన టీడీపీ గూండాలతో అల్లర్లు సృష్టించారు. ఆగంతకుల ముసుగులో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడేందుకు యత్నించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తేవడంతో టీడీపీ పాచిక పారలేదు. 

పక్కా పన్నాగం.. 
రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు పక్కా పన్నాగంతో పావులు కదుపుతూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ.. అనంతరం జరిగిన పంచాయతీ, మునిసిపల్, జిల్లా, మండల ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పొందింది. టీడీపీ రాజకీయంగా ఉనికి కోల్పోవడంతో చంద్రబాబులో ఉక్రోషం, ఆక్రోశం కట్టలు తెంచుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో విమర్శించేందుకు టీడీపీకి ఏ అంశం కూడా లభించడం లేదు. దాంతో రాష్ట్రంలో లేని సమస్యను సృష్టించి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని కుతంత్రానికి తెరతీశారు. ఇందులో భాగంగా ఎన్నడూ లేని రీతిలో టీడీపీ బూతు పురాణం వల్లిస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది. 
టీడీపీ కార్యాలయం వద్ద పోలీసులతో వాగ్వాదం చేస్తోన్న టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా తదితరులు  

గుజరాత్‌ మూలంతో స్కెచ్‌
కేంద్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు గుజరాత్‌లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ అంశాన్ని ఆధారంగా చేసుకుని కుట్రకు పథకాన్ని రచించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌ని తీవ్రంగా కించపరిచే వ్యాఖ్యలు చేయడం.. అసభ్యకరమైన పదజాలంతో దూషించడం.. తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం అన్నది ఆ పన్నాగం. అందుకోసం ముందుగా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని నెల రోజుల క్రితం రంగంలోకి దించారు. ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి పత్రికల్లో రాయలేని భాషలో దూషించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తే.. టీడీపీ నేతలు, కార్యకర్తలు నానా యాగీ చేశారు.

అనంతరం టీడీపీ నేత ధూళిపాళ్ల అదే రీతిలో సీఎం వైఎస్‌ జగన్‌ను కించపరుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే సమర్పించమని పోలీసులు నోటీసులు ఇస్తే ఇంత వరకు సమాధానమే లేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే టీడీపీ నేత పట్టాభి కాకినాడలో అగ్ని ప్రమాదానికి గురైన బోటు అంశాన్ని అవకాశంగా చేసుకుని వైఎస్‌ జగన్‌పై అవాస్తవ ఆరోపణలతో బురద జల్లేందుకు యత్నించారు.  మత్స్యకా రులను ఉద్దేశించి కూడా ఆయన అనుచిత వ్యాఖ్య లు చేయడంతో వారు పట్టాభిని ఘెరావ్‌ చేశారు. 

చంద్రబాబు రాకతో క్లైమాక్స్‌కు కుట్ర 
హైదరాబాద్‌లో ఉంటూ పన్నాగాన్ని దశల వారీగా అమలు చేస్తూ వచ్చిన చంద్రబాబు ఈ కుట్రను క్లైమాక్స్‌కు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అందుకే   చంద్రబాబు చడీచప్పుడు లేకుండా  ఉండవల్లి చేరుకున్నారు. ఆ తరువాత అసలు కథ మొదలైంది. 

రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు 
రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ఆవేశాలకు గురికాకుండా సంయమనం పాటించాలని డీజీపీ కార్యాలయం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించామని తెలిపింది. ప్రజలు సంయమనం పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరింది. 

బంద్‌ పిలుపునకు మద్దతు కరువు 
టీడీపీ ప్రకటించిన బుధవారం రాష్ట్ర బంద్‌కు ఏ వర్గం నుంచి కూడా మద్దతు లభించడం లేదు. వ్యక్తిగత దూషణలతో అప్రయోజనాత్మకంగా ఉన్నందున ఈ బంద్‌కు మద్దతు తెలపడం లేదని విజయవాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మంగళవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం సహేతుకంగా లేనందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు చెప్పారు. కరోనా కాలంలో వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతుంటే.. సమాజానికి ఎలాంటి ఉపయోగం లేని ఈ బంద్‌కు తాము సహకరించేది లేదని స్పష్టం చేశారు.

దాడిపై విలేకరి ఫిర్యాదు
తనపై టీడీపీ కార్యకర్తలు అబ్ధుల్‌ కరీమ్, అబ్ధుల్‌ మజీద్, ఇంతియాజ్‌లు దాడి చేసినట్లు సాక్షి టీవీ జర్నలిస్టు అభిరామ్‌ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, జర్నలిస్ట్‌పై దాడిని మంగళగిరి ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు ఖండించారు.    

వివాదాలకు ఆజ్యం పోసేందుకు తెరపైకి చంద్రబాబు
తాను అనుకున్న కుట్రను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు చంద్రబాబు మంగళవారం సాయంత్రం తెరపైకి వచ్చారు. టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందంటూ మొసలి కన్నీరు కార్చారు. ఆయన కూడా సీఎం వైఎస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసేందుకు యత్నించారు. బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా ఎక్కడాలేని ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ పళ్లు పటపటా కొరుకుతూ.. ఊగిపోతూ.. పక్కా స్క్రిప్ట్‌ ప్రకారం కథ నడిపించారు. తద్వారా బంద్‌ సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని ఆయన టీడీపీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారని పరిశీలకులు చెబుతుండటం గమనార్హం.

14 ఏళ్లు సీఎంగా చేసిన ఆయన ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి బూతు పురాణం మాట్లాడించడం ఏమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అదే బూతు పురాణం చంద్రబాబును ఉద్దేశించి ఎవరైనా అని ఉంటే టీడీపీ శ్రేణులు ఎంత తీవ్రంగా స్పందించేవి.. రాష్ట్రంలో ఎంతగా దాడులకు పాల్పడి బీభత్సం సృష్టించేవో తాము ఊహించగలమని కూడా పరిశీలకులు చెప్పడం గమనార్హం. కానీ అందుకు భిన్నంగా వైఎస్సార్‌సీపీ పూర్తి సంయమనంతో వ్యవహరించి, పరిస్థితి అదుపు తప్పకుండా విజ్ఞతతో వ్యవహరించిందని ప్రశంసిస్తున్నారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ వెంటనే స్పందించి గొడవలు జరగకుండా నివారించగలిగారు.

సీన్‌–1: నక్కా నిరాధార ఆరోపణలు
టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు తెరపైకి వచ్చారు. వైఎస్సార్‌సీపీ నేతలు గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నారంటూ అవాస్తవ ఆరోపణలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. తీవ్ర స్థాయిలో నిరాధార ఆరోపణలు చేశారు. 

సీన్‌–2: పోలీసుల నోటీసులపై హైడ్రామా
నక్కా ఆనంద్‌బాబు ఆరోపణలపై పోలీసులు స్పందించారు. ఆ ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఇవ్వండి.. తగిన చర్యలు తీసుకుంటాం.. అని నిబంధనల ప్రకారం ఆయనకు సోమవారం నోటీసులు ఇవ్వబోయారు.  అయితే ఈ అంశాన్ని పక్కదారి పట్టించేలా టీడీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరులో అర్ధరాత్రి హైడ్రామా సృష్టించారు. ఆ నోటీసులను తీసుకునేందుకు నిరాకరించారు. మంగళవారం ఉదయం దీనిపై స్పందిస్తానని చెప్పడం వెనుక పెద్ద కుట్ర ఉంది. 

సీన్‌–3: పట్టాభి ద్వారా అమలు
చంద్రబాబు మంగళవారం ఉదయం పట్టాభిని తన నివాసానికి పిలిపించుకున్నారు. అప్పటికే సిద్ధం చేసిన బూతు పురాణం స్క్రిప్ట్‌ను పట్టాభికి ఇచ్చారు. దేశంలో ఏ ముఖ్యమంత్రినీ ఎవరూ విమర్శించని దిగజారుడు భాషతో బూతు పురాణాన్ని మాట్లాడమని చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం టీడీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. తన బాస్‌ చెప్పిన స్క్రిప్ట్‌ను పట్టాభి యథాతథంగా అమలు చేశారు. రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో రికార్డు స్థాయిలో 151 స్థానాల్లో గెలిపించి అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి పట్టాభి నీచమైన భాషలో విమర్శించడంతో అంతా విస్తుపోయారు. ప్రతిపక్ష పార్టీ అధికార పక్షాన్ని విమర్శించవచ్చు.. కానీ అందుకు టీడీపీ వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు అంత అసభ్యకరమైన భాషలో సీఎం జగన్‌ను విమర్శించాలని పట్టాభిని తెరపైకి తేవడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. తద్వారా వైఎసార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టాలన్నది టీడీపీ లక్ష్యం. అందుకోసమే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సీఎంపై బరితెగించి మరీ అనుచిత విమర్శలు చేశారు. అంతగా తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏ పార్టీ కూడా మౌనంగా ఉండదు కదా. సహజంగానే అభ్యంతరం తెలిపి నిరసన వ్యక్తం చేస్తుంది. దీన్ని భూతద్దంలో చూపించి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలన్నది టీడీపీ అసలు లక్ష్యం. అందుకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన టీడీపీ గూండాలను ముందుగానే ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంతోపాటు ఇతర ప్రాంతాల్లో మోహరించారు. 

సీన్‌ – 4: దాడులకు తెగబడ్డ టీడీపీ గూండాలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిరసన తెలపగానే టీడీపీ గూండాలు అల్లర్లు మొదలు పెట్టారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ముందుగానే సిద్ధంగా ఉన్న ఆగంతకులు బీభత్సం సృష్టించారు. వారే రాళ్ల దాడికి పాల్పడ్డారు. ముగ్గురిపై దాడులకు తెగబడ్డారు. వాటిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేశారు. మంగళగిరి సాక్షి టీవీ రిపోర్టర్‌ అభిరామ్‌పై దాడి చేసి, ఆయన మెడలో బంగారు గొలుసును లాక్కుపోయారు. ఆయన్ను సహచర పాత్రికేయులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి దాడిలో ఓ పోలీసు చేతికి గాయమైంది.

ఆ విధంగా టీడీపీ ప్రధాన కార్యాలయంలోనే కాసేపు రాద్ధాంతం చేశారు. ఇక కొన్ని నెలల క్రితం పట్టాభిపై దాడి అంటూ టీడీపీ హైడ్రామా సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ ఆ తరువాత ఆ ఫిర్యాదుపై పట్టాభి ఇంతవరకు మాట్లాడనే లేదు. ఎందుకంటే పట్టాభి వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ అది. అందులో నిజాలు బయటకు వస్తే తమ గుట్టు రట్టు అవుతుందని ఆయన భావించారు. అందుకే మౌనంగా ఉండిపోయారు. కాగా, అదే రీతిలో పట్టాభి మనుషులే కొందరు ఆయన నివాసంపై మంగళవారం రాళ్ల దాడికి పాల్పడ్డారు.

ఆ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలపై నెట్టివేయాలన్నది వారి లక్ష్యం. కానీ పోలీసులు వెంటనే ఆయన నివాసానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. ఈ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి, తర్వాత కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడి జరిగిన సమయంలో పట్టాభి కుమార్తె, పనిమనిషి, కారు డ్రైవర్‌ ఇంట్లో ఉన్నారు. కాగా, పట్టాభి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అభిమానుల నిరసన ప్రదర్శనల సందర్భంగా ఘర్షణలకు తెగబడాలని టీడీపీ యత్నించింది. విశాఖపట్నం, హిందూపురంలో అందుకోసం టీడీపీ గూండాలు.. వైఎస్సార్‌సీపీ అభిమానులతో ముందస్తు పన్నాగంతో ఘర్షణలకు దిగారు. 

రేపటి బంద్‌కు సహకరించం
దళిత్‌ ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌
టీడీపీ బంద్‌కు తాము మద్దతివ్వడం లేదని దళిత్‌ ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌ తెలిపింది. రాజకీయ గొడవలుంటే వైఎస్సార్‌సీపీ, టీడీపీ చూసుకోవాలని కోరింది. బంద్‌ పేరుతో వ్యాపారస్తులకు ఆర్థిక నష్టం చేయడం సరికాదని అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్‌ తెలిపారు. బుధవారం టీడీపీ తలపెట్టిన బంద్‌కు రాష్ట్రంలోని వ్యాపారవేత్తలు ఎవరూ సహకరించకూడదని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎంను అవమానించడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే అవుతుందన్నారు. 

మణిపాల్‌ ఆస్పత్రి వద్దా టీడీపీ హైడ్రామా
తాడేపల్లి : టీడీపీ ప్రధానకార్యాలయం వద్ద పరస్పర తోపులాటలో ఇరు వర్గాల్లోని వారికి స్వల్ప గాయాలయ్యాయి.  వీరిలో బదిరీనాథ్‌ అనే యువకుడి తలకు గాయమైంది. గాయపడ్డ వారిని సమీపంలోని మణిపాల్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైద్యులు బదిరీనాత్‌ తలకు మూడు కుట్లు వేయాల్సి ఉంటుందని, అందుకు ఉపక్రమించగా, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబు వచ్చే వరకు ఆగాలని కుట్లు వేయనివ్వలేదు. ఈ వివాదాన్ని పెద్దదిగా చేసి చూపడానికి, పలువురు నేతలను అక్కడికి రప్పించి హంగామా సృష్టించారు. చంద్రబాబు వచ్చి, ఆ యువకుడిని పరామర్శించి వెళ్లాక.. వైద్యులు కుట్లు వేశారు. పెద్ద గాయం కాదని ఇంటికి వెళ్లిపోవచ్చని సూచించారు.  అతన్ని కనీసం 24 గంటల పాటు ఆస్పత్రిలోనే ఉంచుకోవాలని వైద్యులను బెదిరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement