పోలీసు అధికారులతో వాదనకు దిగిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ శ్రేణులు (ఫైల్)
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కోస్తాంధ్రలోని గుడివాడ రాజకీయాలపై టీడీపీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇటీవలి కాలంలో ఇది మరీ ఎక్కువైంది. ప్రతి అంశంలోనూ గిల్లికజ్జాలు పెట్టుకోవడం, తీవ్ర నిందారోపణలు మోపడం, బల ప్రదర్శనలకు దిగడం, దాడులకు పురమాయిస్తూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం, చివరకు పాలక పార్టీ నేత లపై నెట్టేయడం రివాజైందనే చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా వైఎస్సార్ సీపీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు, మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), ఆయన ముఖ్య అనుచరులపై టీడీపీ నాయకత్వం, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని మరీ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా టీడీపీ అధిష్ఠానమే పార్టీలో గ్రూపులను ఎగదోస్తూ తగువులను ప్రోత్సహిస్తోందనే అనుమానాలు స్వపక్షం నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి.
అంతర్గత కుమ్ములాటలతో నిలకడలేక ప్రతి సాధారణ ఎన్నికల్లోనూ చతికిలపడుతున్న ‘సైకిల్’కు స్టాండ్‌ను అమర్చుకునే క్రమంలో ప్రతిపక్ష పార్టీపై బురద చల్లుతుందనే చర్చ లేకపోలేదు. వీటన్నింటినీ మించి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లోపాలను నిత్యం ఎత్తి చూపుతూ తూర్పార పడుతున్న కొడాలిపై ప్రత్యేకంగా రాజకీయ కక్ష తీర్చుకునేలా ఎన్నికలకు ముందస్తు ఎత్తుగడలు అధికమవుతున్నాయనేది పరిశీలకుల మాట. ప్రతి ఎన్నికకూ గుడివాడ నుంచి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపడం, ఓటమిపాలై వెనుతిరగడం షరా మామూలైన నేపథ్యంలో తాజాగానూ కొత్త పేర్లను తెరపైకి తెచ్చే పనిలో తమ పార్టీ ఉందని టీడీపీ వర్గాలే బాహాటంగా అంటున్నాయి.
టీడీపీకి గుడివాడ ప్రత్యేకం...
టీడీపీకి గుడివాడ అన్ని కోణాల్లో ప్రత్యేకం. పార్టీ ఆవిర్భావ నేత ఎన్టీ రామారావుది ఈ ప్రాంతమే. నిత్యం జాకీలు పెట్టి టీడీపీని నిలబెట్టే ప్రయత్నాలు చేసే మీడియా ముఖ్యులూ ఇక్కడివారే. ఎలాగైనా పునర్వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో కొడాలిని లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నారనడం బహిరంగ రహస్యం. ఎన్టీఆర్ గుడివాడ నుంచి 1983లో స్వతంత్ర అభ్యర్థిగా, 1985లో టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసి విజయం సాధించారు. 1994లో రావి శోభనాద్రీశ్వరరావు, 1999లో రావి హరిగోపాల్ గెలుపొందారు.
2004 నుంచి కొడాలిదే హవా..
2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించిన కొడాలి నాని 2009లోనూ అదే పరంపర కొనసాగించారు. చంద్రబాబుతో విభేదించి టీడీపీని వీడిన కొడాలిని గుడివాడ ఓటర్లు మాత్రం విస్మరించలేదు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు.
విశ్వసనీయతకే పెద్దపీట అంటూ...
గుడివాడ ఓటర్లు విశ్వసనీయతకు, నాయకత్వానికీ పెద్దపీట వేస్తారని, వారి నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయలేదన్నది కొడాలి మాట. తాను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీకి కట్టుబడి ఉన్నానని, అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబానికీ విధేయుడినని చెప్పుకుంటుంటారు. ఇవే తనను నిలబెడుతున్నాయంటారు. ఎన్టీఆర్‌కు, ఆయన కుటుంబానికి తీరని ద్రోహం చేసిన చంద్రబాబును ఏవిధంగానూ వదిలేది లేదని పరుషంగా అంటుంటారు. ఈ పరిస్థితుల నుంచి కొడాలిని గిరాటు వేయాలనే చంద్రబాబు ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయన్నది జవాబులేని ప్రశ్నే.
కొడాలిపై కాలు దువ్వడమే..
2014 నుంచి 2019 మ«ధ్య అధికారంలో ఉన్నంత కాలం కొడాలిని ఎలాగైనా దెబ్బ తీయాలని చంద్రబాబు శతథా ప్రయతి్నస్తున్నారు. ఆయనపైకి బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు తదితరులతో పాటు రౌడీలను విజయవాడ నుంచి పంపారు. ఇలా రెండు పర్యాయాలు విజయవాడ నుంచి మందీ మార్భలంతో కొడాలిపై కత్తులు దూస్తూ వెళ్లడం ఆయా సందర్భాల్లో ఉద్రిక్తతలకు దారి తీశాయి. జిల్లా పార్టీ అ«ధ్యక్షునిగా, మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావును నానిపైకి అధిష్ఠానం ఉసిగొల్పని సందర్భమంటూ లేదనేది ఆ పార్టీలోని అన్నిస్థాయిల నాయకులకూ తెలుసు. క్యాసినో పేరిట, గడ్డం గ్యాంగ్ అంటూ... వ్యక్తిత్వ హనన ప్రయత్నాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి.
టీడీపీవి విఫల ప్రయోగాలే..
కొడాలిని ఎలాగైనా ఓడించి తీరాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు రావి, పిన్నమనేని, దేవినేని కుటుంబ వారసులను రంగంలోకి దించినా ఫలితం లేదు సరికదా కొరకరాని కొయ్యలా మారారు. రానున్న ఎన్నికల్లోనూ కొత్త ప్రయోగం చేయపోతున్నారని, ఇప్పటికే ఎన్‌ఆర్‌ఐని రంగ ప్రవేశం చేయించారనే ప్రచారం ఊపందుకుంది. అంతర్గత కుమ్ము లాటలతో పార్టీ మరింతగా కకావికలమవుతుందా, నిలబడుతుందా కాలమే చెప్పాలి.
కాగా 2004లో టీడీపీ అభ్యర్థిగా 8,864 ఓట్లు (8.06 శాతం), 2009లో 17,630 ఓట్లు (11.90 శాతం) ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన నాని వైఎస్సార్ సీపీ అభ్యరి్థగానూ అంతకన్నా ఆధిక్యతను కొనసాగించారు. 2014లో 11,537 ఓట్లు (7.29 శాతం) మెజార్టీతో రావి వెంకటేశ్వరరావుపై గెలుపొందారు. టీడీపీ జిల్లా రాజకీయాల్లో రెండు దశాబ్దాలకు పైగా చక్రం తిప్పిన మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) కుమారుడు అప్పటి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అయిన దేవినేని అవినాష్‌ను ప్రత్యేకంగా గుడివాడకు పంపి కొడాలిపై పోటీ చేయించారు.
చదవండి: ఏ ఎండకు ఆ గొడుగు.. బాబు ‘సానుభూతి’ రాజకీయం
చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ రూ.కోట్లు కుమ్మరింపజేశారు. గత ఎన్నికలన్నింటికన్నా 19,479 ఓట్లు (9.6 శాతం) మెజార్టీని నాని సాధించారు. ఇదే ఎన్నికల్లో మరో విచిత్ర ప్రయోగమూ జరిగింది. కొడాలి వెంకటేశ్వరరావు అనే పేరుగల వ్యక్తిని పోటీకి దింపడం గమనార్హం. అంతర్గత అవగాహనలో భాగంగా 2014లో కాంగ్రెస్ అభ్యరి్థగా అట్లూరి సుబ్బారావును నానిపై పోటీకి నిలపడం ద్వారా ఓట్లు చీలి తమకు అనుకూల ఫలితం వస్తుందనే బాబు బృందానికి నిరాశే మిగిలింది.
1985లో టీడీపీ అభ్యర్థిగా ఎన్టీఆర్‌కు 53.64 శాతం ఓట్లు రాగా వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా కొడాలి నానికి 2014లో 55.32 శాతం, 2019లో 53.50 శాతం ఓట్లు రావడం విశేషం. కాగా ఎన్టీఆర్‌కు ఇండిపెండెంట్‌గా 1983లోను, 2004లో తొలిసారి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన నానికి 60 శాతానికి పైగా ఓట్లు దక్కడం పరిశీలనాంశం. కాగా 1999 ఎన్నికల్లో ‘అన్న తెలుగుదేశం పార్టీ’ అభ్యర్థిగా గుడివాడ నుంచి నందమూరి హరికృష్ణ పోటీ చేయగా 11,238 ఓట్లు దక్కాయి. కొడాలి అప్పటికి ఎన్నికల రంగంలో లేరు.
Comments
Please login to add a commentAdd a comment