సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న వివాదం జరిగినా దానికి వైఎస్సార్‌సీపీతో లంకె పెట్టేయడం.. తద్వారా రాజకీయ మైలేజ్ కోసం కక్కుర్తి పడటం టీడీపీకి పరిపాటిగా మారింది. వ్యక్తిగతమా, కుటుంబ గొడవా, వర్గ పోరాటమా.. అన్నది చూడకుండా.. ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా.. ఏదైనా సంఘటన జరిగితే చాలు.. చంద్రబాబు, లోకేష్ నుంచి కిందిస్థాయి నేతల వరకు ఏమాత్రం ఇంగితం లేకుండా అధికార పార్టీపై నిందలు మోపేస్తారు.
చదవండి: పవన్ విషప్రచారానికి దిమ్మతిరిగే కౌంటర్
చాలా సంఘటనల్లో అసలు వాస్తవాలు బయటకొచ్చి తమ పార్టీ పరువే పోతున్నా.. వారి తీరు మారడంలేదు. హరిపురంలో ఏళ్లనాటి కుటుంబ గొడవ నేపథ్యంలో ఇద్దరు మహిళలపై దాడి ఘటనలో కూడా టీడీపీ ఇలాగే అభాసుపాలైంది. ఈ కేసులో నిందితులు తమ పార్టీకి సన్నిహితులేనన్న విషయం విస్మరించి విషం చిమ్మడానికి తెగబడింది. అసలు విషయం బయటపడటంతో టీడీపీ పరిస్థితి తేలు కుట్టిన దొంగలా తయారైంది.
టీడీపీ మళ్లీ అబద్ధాలను, అవాస్తవ ప్రచారాలనే నమ్ముకుంటోంది. ఎక్కడో ఏదో జరిగిన దానికి వైఎస్సార్‌సీపీ నాయకులను, ప్రభుత్వాన్ని ఆపాదించి రాజకీయ లబ్ధి పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మందస మండలం హరిపురంలో నెలకొన్న ఘటనలోనూ ఇదే జరిగింది.
మందస మండలం హరిపురంలో స్థల వివాదం ముదిరి సోమవారం ఇద్దరు మహిళలపై కంకర పోసే వరకూ వెళ్లింది. కొట్ర రామారావు, ప్రకాశరావు, ఆనందరావులతో సమీప బంధువులైన కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రిలకు ఓ ఇంటి స్థలం విషయమై ఎప్పటినుంచో వివాదం ఉంది. గత తొమ్మిదేళ్లుగా వీరి మధ్య స్థల వివాదం నడుస్తోంది. 2017 నుంచి బాధితులైన తల్లీ కూతుళ్లు పోరాటం చేస్తున్నారు. అప్పటి ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ, ఆయన అల్లుడు వద్దకు పంచాయతీ వెళ్లింది.
కానీ వివాదాన్ని పరిష్కరించలేదు. అందులోనూ కొట్ర రామారావుకు శివాజీ, కళా వెంకటరావు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల వివాదం పరిష్కారానికి చొరవ చూపలేదన్న ఆరోపణలున్నాయి. టీడీపీ ప్రభుత్వంలోనే బాధిత మహిళలు 2017, 2019లో నిరహార దీక్షలు కూడా చేశారు. చివరికి వివాదం కోర్టుకు చేరింది. ఇప్పుడు ఆ మహిళలపై కొట్ర రామారావు అండ్‌కో బాధిత మహిళలపై కంకర పోసి సజీవ సమాధి చేసేందుకు యత్నించారని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు చెప్పుకొస్తున్నారు.
ఈ ఫొటోలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావుతో ఉన్న వ్యక్తే హరిపురంలో బాధిత మహిళలపై కంకర పోసిన ఘటన కేసులో ఏ1గా ఉన్నారు. ఈయన పేరు కొట్ర రామారావు, టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనడానికి ఈ ఫొటోనే నిలువెత్తు సాక్ష్యం. మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ, గౌతు శిరీష దగ్గరి నుంచి టీడీపీ కీలక నేతల వరకు సత్సంబంధాలు ఉన్నాయి. అంతమాత్రాన బాధిత మహిళలపై కంకర పోసి, సజీవ సమాధి చేసేందుకు టీడీపీ కీలక నేతలు అండగా నిలిచారని చెప్పడం సమంజసం కాదు. రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదం చినికి చినికి గాలివానగా మారి మహిళలపై కంకరపోసే వరకు వెళ్లిందే తప్ప కింజరాపు రామ్మోహన్‌నాయుడో, కళా వెంకటరావో, గౌతు శ్యామ సుందర్ శివాజీయో చేయించరాని అనడం తప్పు. ఆరోపణలు, విమర్శలు చేయడం కూడా సరికాదు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌కు కనీసం ఇంగితం లేకుండా సోమవారం ట్వీట్లపై ట్వీట్‌లు పెట్టారు.
ఇక్కడ జరిగిన ఘటనను ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లింకు పెట్టి దుష్పచారం చేశారు. వైఎస్సార్‌సీపీకి ఆపాదించి, పోలీసు వ్యవస్థను కూడా వదలకుండా అబద్ధపు ప్రచారం చేశారు. పోలీసులు చర్యలు తీసుకోలేదనే స్థాయికి ప్రచారాన్ని తీసుకెళ్లారు. వాస్తవంగా ఈ ఘటనపై సోమవారమే కేసు నమోదు చేసి, అభియోగాలున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇదేమీ చూడకుండా తమ రాజకీయ లబ్ధి కోసం హరిపురం ఘటనను వైఎస్సార్‌సీపీతో ముడిపెట్టి కుట్రపూరితంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించారు. చివరికి ఆ ప్రచారంలో వాస్తవం లేదని, అదంతా అబద్ధమని తేలిపోవడంతో తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు.
గతంలో టీడీపీ కుట్రలివే..
టెక్కలిలో ఎప్పుడో బుద్ధుడి విగ్రహం మణికట్టు విరిగిపోతే.. దాన్ని రాజకీయం చేసి మత విద్వేషాలు రెచ్చగొడతామని యతి్నంచి తెలుగు తమ్ముళ్లు దొరికిపోయారు. దీంట్లో తెరవెనక అచ్చెన్నాయుడు కీలక పాత్ర వహించారు.
సంతబొమ్మాళి మండలం పాలేశ్వరపురం ఆలయంలోని పాత నంది విగ్రహాన్ని టీడీపీ నేతలు పట్టపగలే తరలించి, నడిరోడ్డుపై ఉన్న సిమెంట్ దిమ్మపై ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ప్రతిష్టించి అపచారానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఇదంతా చేసిందని, హిందు మతానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని దు్రష్పచారం చేసేందుకు కుట్ర పన్నారు. కానీ సీసీ కెమెరాల పుటేజీలో టీడీపీ నేతల బాగోతం బయటపడింది. అడ్డంగా దొరికిపోవడంతో పోలీసులు కేసు పెడితే.. విగ్రహం మార్చినంత మాత్రాన కేసులు పెడతారని బుకాయింపునకు దిగారు.
పరీక్షల సీజన్‌లో సరుబుజ్జిలి మండలం రొట్టవలస, కొత్తకోట జెడ్పీహెచ్ స్కూళ్లలో పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం టీడీపీ నాయకులు లీక్ చేసి, దానిని ప్రభుత్వంపై మోపి దుష్ప్రచారానికి యత్నించి దొరికిపోయారు. చివరికీ వారంతా అరెస్టు అయ్యారు.
అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందులు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక, ప్రసారాల శాఖ ప్రెస్‌నోట్ జారీ చేసినట్టుగా ఒక ఫేక్ ప్రెస్‌నోట్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అనుచరుడైన సంతబొమ్మాళి మండలం బోరుబద్ర గ్రామానికి చెందిన అప్పిని వెంకటేష్ సామాజిక మాధ్యమాల్లోకి వెళ్లి దుష్ప్రచారానికి దిగారు. సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలతో విష ప్రచారం చేస్తున్నట్టుగా వెంకటేష్‌ను గుర్తించి సీఐడీ అధికారులు విచారణ కూడా చేశారు.
హరిపురం ఘటనలో ఇద్దరి అరెస్ట్
మందస: మండలంలోని హరిపురంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు మందస ఇన్‌చార్జి ఎస్‌ఐ మధు తెలిపారు. హరిపురంలో భూ వివాదానికి సంబంధించి కొట్ర దాలయ్మ, మజ్జి సావిత్రిలపై ట్రాక్టర్‌తో కంకర వేసి హత్యాయత్నం చేశారన్న సంఘటన సంచలనంగా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు హరిపురానికి చెందిన కొట్ర రామారావు, పిడిమందస గ్రామానికి చెందిన కంచిలి ప్రకాశరావులను అరెస్ట్ చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్టు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment