వలస నేతలతో ఉన్న నేతలకు గండం
వేమిరెడ్డి రాకతో సోమిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి సీట్లు గల్లంతు
సోమిరెడ్డికి బదులు సర్వేపల్లిలో రూప్‌కుమార్‌కి సీటివ్వాలని వేమిరెడ్డి పట్టు
కోవూరు సీటును తన సతీమణికి ఇప్పించేందుకు ప్రయత్నాలు
లావు శ్రీకృష్ణదేవరాయలు చేరికతో యరపతినేని, అరవింద్‌బాబు సీట్ల కిందకు నీరు
గుమ్మనూరు జయరాం దెబ్బకు జితేంద్ర గౌడ్.. సారథి ప్రభావంతో ముద్దరబోయినకు చెక్
ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేసి తమను అవమానిస్తున్నారని సీనియర్ల ఆగ్రహం
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ వద్దనుకున్న నాయకులను అక్కున చేర్చుకున్న టీడీపీకి ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయి. పార్టీ ఫిరాయించి వలస వచ్చిన నేతలు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు ఎసరు పెడుతున్నారు. భారీగా నిధులు ఇస్తుండటంతో చంద్రబాబు కూడా వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. వలస నేతల దెబ్బకు సీట్లు ఎగిరిపోయిన నేతలు చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు.
దిగుమతి నేతలపై కారాలు మిరియాలు నూరుతూ నియోజకవర్గాల్లో వారికి పట్టు దొరక్కుండా చేస్తున్నారు. ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేసి, తమను అవమానిస్తున్నారని సీనియర్లు చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో టీడీపీలో పాత, కొత్త నేతల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
నెల్లూరు టీడీపీలో చిచ్చుపెట్టిన వేమిరెడ్డి
ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పెద్ద చిచ్చే పెట్టారు. ఇటీవలే టీడీపీలో చేరిన ఆయన నెల్లూరు ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా మరికొన్ని ఎమ్మెల్యే స్థానాల్లో తాను చెప్పిన వారికే సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కోవూరు స్థానాన్ని తన సతీమణి ప్రశాంతికి ఇవ్వాలని చంద్రబాబుపై గట్టి ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు ఆమె పేరుతో ఐవీఆర్‌ఎస్ సర్వే జరుగుతోంది. దీంతో అక్కడి మాజీ ఎమ్మెల్యే పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి రగిలిపోతున్నారు. ఆయన ఈసారి తన కొడుకుని అక్కడ పోటీ చేయించేందుకు చాలారోజుల నుంచి పని చేస్తున్నారు.
ఇప్పుడు బయటి వ్యక్తి కోసం తమను మోసం చేయడం ఏమిటని ఆయన అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వేమిరెడ్డి ప్రవేశంతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సీటు కూడా ఎగిరిపోయే పరిస్థితి ఏర్పడింది. సర్వేపల్లిలో సోమిరెడ్డి స్థానంలో తనతోపాటు టీడీపీలో చేరిన నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్‌ని పోటీ చేయించడానికి వేమిరెడ్డ రంగం సిద్ధం చేశారు. రూప్‌కుమార్ పేరుతో సర్వే కూడా చేస్తుండడంతో సోమిరెడ్డి వర్గం భగ్గుమంటోంది.
టీడీపీలో ఆది నుంచి ముఖ్య నాయకుడిగా ఉన్న సోమిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు వద్ద చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్బున్న నేతలతోనే అంతా అయిపోతే ఇక తామెందుకుని ఆయన అనుయాయుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాన మొన్న పార్టీలో చేరి తమ సీట్లను ప్రభావితం చేయడం ఏమిటని, చంద్రబాబు ఆయనకు వంతపాడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘లావు’ దెబ్బకు ఇద్దరు సీనియర్లు విలవిల
వైఎస్సార్‌సీపీ నర్సరావుపేట లోక్‌సభ సీటు నిరాకరించడంతో చంద్రబాబు పక్కన చేరిన లావు శ్రీకృష్ణ దేవరాయలు దెబ్బకు ఇద్దరు టీడీపీ సీనియర్లు విలవిల్లాడుతున్నారు. పార్టీలో చేరకముందే ఆయన సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు సీటుకు ఎసరు పెట్టారు. యరపతినేని పోటీ చేసే గురజాల సీటును జంగా కృష్ణమూర్తికి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు.
చంద్రబాబు దానికి సరేనని యరపతినేనికి సీటు ఖరారు చేయకుండా పక్కనపెట్టేశారు. అంతటితో ఆగకుండా యరపతినేనిని నర్సరావుపేట ఎమ్మెల్యే స్థానానికి పంపాలని సూచించడంతో చంద్రబాబు దానిపై ఐవీఆర్‌ఎస్ సర్వే చేయించారు. దీంతో అక్కడి ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబు సీటు ప్రశ్నార్థకమైంది. లావు రాజకీయంతో నర్సరావుపేట, గురజాల నియోజకవర్గాల్లో అయోమయం నెలకొంది.
గుమ్మనూరు రాకతో జితేంద్రగౌడ్ సీటు గల్లంతు
వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వెళ్లిపోయి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి గుంతకల్ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సమ్మతించడం టీడీపీలో అగ్గి రాజేసింది. గుంతకల్ సీటును జయరాం దక్కించుకోవడంతో అక్కడి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ సీటు గల్లంౖతైంది. దీంతో ఆయన వర్గం జయరాంకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం స్థానాన్ని బయట నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్‌కి ఖరారు చేయడంతో మాజీ మంత్రి దేవినేని ఉమా పరిస్థితి ప్రశ్నార్థకమైంది.
నూజివీడు సీటును వలస నేత కేపీ సారథికి కేటాయించడంతో పదేళ్లుగా అక్కడ పార్టీ కోసం పనిచేస్తున్న బీసీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు చోటు లేకుండాపోయింది. ఇలా రాజకీయ అవసరాల కోసం అప్పటికప్పుడు పార్టీ ఫిరాయించిన వారిని చంద్రబాబు అందలం ఎక్కించుకుని పార్టీ కోసం పని చేసిన వారిని పూచికపుల్లల్లా తీసివేస్తుండటం టీడీపీలో కల్లోలం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment