మాటల్లోనే బీసీలపై ప్రేమ
వెనుకబడిన వర్గాలను పట్టించుకోని టీడీపీ
ఆ పార్టీపై రగిలిపోతున్న యాదవ సామాజికవర్గం
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్క సీటూ కేటాయించని బాబు
వారికి సముచిత స్థానం కల్పించిన సీఎం జగన్
నరసరావుపేట ఎంపీ, కనిగిరి, కందుకూరు అసెంబ్లీ స్థానాల కేటాయింపుసాక్షిప్రతినిధి, ఒంగోలు: జయహో బీసీ... అంటూ వారిని ఉద్దరిస్తామని టీడీపీ–జనసేన సంయుక్తంగా ప్రకటించి నేడు విస్మరించాయి. బీసీలను అందులో ప్రధానంగా యాదవ సామాజికవర్గానికి ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్క సీటు కూడా కేటాయించకుండా చంద్రబాబు వారి వెన్ను విరిచారు. కానీ బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారికి భరోసా కల్పించారు. ఈ మూడు జిల్లాల్లో 50 శాతానికి పైగా బీసీ ఓట్లు ఉన్నాయి.
ఒక్కో జిల్లాలో 2.50 లక్షల నుంచి 3.50 లక్షల వరకు యాదవ ఓటర్లు ఉన్నారు. అయితే ఆ జిల్లాల్లో పార్లమెంట్ కానీ, అసెంబ్లీకి కానీ టికెట్లు కేటాయించకపోవటంతో టీడీపీపై యాదవులు రగిలిపోతున్నారు. కానీ యాదవులకు వైఎస్సార్‌సీపీ సముచిత స్థానం కల్పించింది. ఆ జిల్లాల్లో వారికి పెద్దపీట వేసింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యాదవ నేత బీదా మస్తాన్‌రావును రాజ్యసభకు పంపింది. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్‌కుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది.
ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీకి సాధారణ జెడ్పీటీసీ సభ్యుడిని ప్రకటించి సంచలనం సృష్టించింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌ను కందుకూరు అసెంబ్లీకి పోటీలో నిలబెట్టింది. మరోవైపు గురజాల నియోజకవర్గానికి చెందిన యాదవ నేత జంగా కృష్ణమూర్తికి టీడీపీలో చాన్సే లేకుండా పోయింది. ఆయన గురజాల టికెట్ కావాలని వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో ఆయనకు సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత కల్పించారు.
పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆ తరువాత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే గురజాల అసెంబ్లీ సీటు ఇస్తానని జంగాకు టీడీపీ నమ్మబలికి మొండిచేయి చూపింది. చీరాలలో టీడీపీ నేత, నియోజకవర్గ ఇన్‌చార్జ్ మద్దులూరి మాలకొండయ్యను దాదాపు ఆ పార్టీ పక్కన పెట్టేసింది. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీకి బాబు మొండిచేయి చూపారు.
యాదవుల్లో సమర్థులు లేరా?
ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలో టీడీపీలో యాదవ సామాజికవర్గానికి చెందిన సమర్థులు లేరా? ఒకప్పటిలా టీడీపీ పరిస్థితి లేదు. వైఎస్సార్‌సీపీలో ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ సీట్లిచ్చి సీఎం జగన్ యాదవులను ఎంతగానో గౌరవించారు. మాకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలనే ఆదరిస్తాం. – మిరియం శ్రీనివాసులు, 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment