టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ | TDP leader Ravuri Iswara Rao joined YSRCP party | Sakshi
Sakshi News home page

టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ

Published Tue, Mar 19 2024 4:22 AM | Last Updated on Tue, Mar 19 2024 4:22 AM

TDP leader Ravuri Iswara Rao joined YSRCP party - Sakshi

ఈశ్వరరావును వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్న చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డి

మా కుటుంబాన్ని రోడ్డున పడేసింది

నలుగురు నేతలు అవమానించారు

ప్రముఖ పారిశ్రామికవేత్త రావూరి ఈశ్వరరావు ఫైర్‌

టీడీపీకి రాజీనామా.. వైఎస్సార్‌సీపీలో చేరిక

చిత్తూరు రూరల్‌: టీడీపీ పేరుకు మాత్రమే బీసీల పార్టీ అని.. కానీ, నిజానికి అది బీసీల వ్యతిరేక పార్టీ అని ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నేత రావూరి ఈశ్వరరావు తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. చంద్రబాబునాయుడుతో పాటు ఆ పార్టీని నమ్ముకుని తాను వీధిలో పడ్డానని కన్నీటిపర్యంతమయ్యారు. టీడీపీలోని ఓ నలుగురు నాయకులు తన కొంపముంచారని ఆరోపించారు. చిత్తూరు గురునగర్‌ కాలనీలోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని కావడంతో పార్టీలో తనను పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు. అంతేకాక.. రూ.340 కోట్లు విలువ­చేసే తన ఫ్యాక్టరీని మూయించారన్నారు.

ఇన్నాళ్లు పార్టీలో ఉన్నందుకు తన పరువు పూర్తిగా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. నిజానికి.. ప్రజాసేవ చేస్తూ 24 ఏళ్లు టీడీపీకి బానిసలా సేవచేశానని.. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా అనేక సంవత్స­రాలు పనిచేశానని ఆయన చెప్పారు. పైగా.. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మనోహర్‌ విజయంలో కీలకపాత్ర పోషించానన్నారు. కానీ, పార్టీ కోసం ఇంతలా కృషిచేసిన తనకు టీడీపీ తీవ్ర ద్రోహం చేసిందని ఆరోపించారు. టీడీపీలోని ఆ నలుగురు నేతలు తనను దారుణంగా అవమానించారని.. వీరు చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గ నేతలను అస్సలు ఎదగనివ్వడంలేదని ఆయన చెప్పారు.

ప్రస్తుత టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గురజాల జగన్‌మోహన్‌కు కూడా వారి నుంచి అవ­మానాలు ప్రారంభమయ్యాయన్నారు. ఇలాంటి నీచమైన పార్టీ నుంచి తాను వైదొలుగుతున్నానని.. టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రావూరి ఈశ్వరరావును వైఎస్సార్‌సీపీ చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డి కలి­శారు. రావూరికి పార్టీ కండువా వేసి వైఎస్సార్‌సీపీ­లోకి ఆహ్వానించి తన విజయానికి పాటుపడాలని అభ్యర్థించారు. సీఎం వైఎస్‌ జగన్‌ సింహంలాంటి వారని, ఆయన చేస్తున్న అభివృద్ధి తనకు బాగా నచ్చిందని రావూరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జగన్‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయానందరెడ్డి గెలుపునకు తాను శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement