ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వ్యతిరేక పార్టీగా ముద్ర వేసుకోవడానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పెద్దగా ఫీల్ కావడం లేదు. రాష్ట్రంలో ప్రాజెక్టులు రావడం లేదని, పరారవుతున్నాయని, వేధిస్తున్నారని నోటికి వచ్చిన ఆరోపణలు చేసిన టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు పరిశ్రమలు వస్తుంటే వాటిపై కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో ఒక్కోసారి నోరు జారి నిజాలు వచ్చేస్తుంటాయని అనుకోవాలి. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ఒక ప్రకటన చూస్తే ఆ అభిప్రాయం కలుగుతుంది.
ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడే మాటే చెప్పారు. లక్ష కోట్ల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం అదానికి, వైసీపీ ముఖ్యనేతల బంధువులకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. వింటుంటే ఇదేమైనా తప్పేమో అనిపించవచ్చు కాని, జాగ్రత్తగా ఆలకిస్తే, రాష్ట్రానికి లక్ష కోట్ల ప్రాజెక్టులు వస్తున్న విషయాన్ని ఆయన నిర్దారణ చేసినట్లయింది.
నాడు అలా.. నేడు ఇలా..
గతంలో కూడా తాము అధికారంలో లేనప్పుడు టీడీపీ నేతలు పరిశ్రమలకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు. ఉదాహరణకు చీరాల రేపల్లె ప్రాంతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. వాన్ పిక్ పేరుతో ఏర్పాటైన సంస్థకు సుమారు 13 వేల ఎకరాలను సేకరించి, ఓడరేవుతో పాటు, విద్యుత్ ప్రాజెక్టులు, తదితర సంస్థల ఏర్పాటుకు రంగం సిద్దం చేశారు. అంతలో దురదృష్టవశాత్తు వైఎస్ మరణించారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి.
వైఎస్ కుమారుడు జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారన్న కక్షతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై సీబిఐ కేసులు పెట్టించారు. ఇలా ఒకటి కాదు.. చేయని అరాచకం అంటూ లేదు. చంద్రబాబు 2014లో గెలిచిన తర్వాత పరిశ్రమలు రావడానికి చేసిన ప్రయత్నం కన్నా ప్రచారా ఆర్భాటానికి విశేష ప్రాధాన్యత ఇచ్చారు. విశాఖలో సదస్సుల పేరుతో ఉత్తిత్తి అగ్రిమెంట్లు చేయించి, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఊదర కొట్టారు. అప్పుడు ఇదే కేశవ్ కాని, మరే టీడీపీ నేత కాని ఈ ప్రాజెక్టులకు టెండర్లు కావాలని అనలేదు. ఇప్పుడు మాత్రం పంప్‌డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు టెండర్లు కావాలని అంటున్నారు. ఇందులో ఏదో జరిగిందని విమర్శిస్తున్నారు.
పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ
ప్రభుత్వం ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేసి, అక్కడ వచ్చిన ప్రతిపాదనలను స్వీకరించింది. ఆ ప్రకారం టీడీపీ నేతలు ప్రతిపాదనలు చేసి ఉండవచ్చు కదా? కాని అలా చేయరు. వీలైనంత బురద చల్లుతారు. దానిని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ పత్రికలు సాధ్యమైనంత ఎక్కువ తాము పూసుకుని, ప్రభుత్వానికి పూస్తుంటాయి. చంద్రబాబు టైమ్‌లో నిజంగా లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు వచ్చి ఉంటే అబ్బో .. ఆయన కాబట్టి వచ్చాయని ఈ పత్రికలు ఊదరగొట్టేవి. అదే వైఎస్ జగన్ హయాంలో పలు పరిశ్రమలు వస్తున్నా, అసలేవి రావడం లేదని టీడీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా అబద్దాలు చెబుతుంటాయి.
కళ్లు తెరిచి పరిశ్రమలను గుర్తించండి
కొప్పర్తిలో పారిశ్రామికవాడ, బద్వేలులో ప్లైవుడ్ ప్లాంట్, కర్నూలులో గ్రీన్ ఎనర్జీ , పులివెందులలో ఆదిత్య బిర్లా యూనిట్, జగ్గంపేట, పిఠాపురంలలో కొత్త పరిశ్రమలు, అనకాపల్లి వద్ద టైర్ల యూనిట్, శ్రీ సిటీలో ఎసి యూనిట్లు, కాకినాడ వద్ద పార్మా హబ్ వంటి పలు ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆదాని సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఆయా ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి జగన్ పరిశ్రమలకు ఎలా సహకరిస్తున్నది బహిరంగంగానే వివరించి ప్రశసించారు. మరో వైపు పంప్‌డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ముందుకు వెళుతుంటే టీడీపీ దిక్కుమాలిన ఆరోపణలు చేస్తోంది. అదాని సంస్థకు, వైసీపీ నేతల బంధువులకు వాటిని కట్టబెడుతున్నారని విమర్శించింది.
ఎట్టకేలకు నిజం కనిపించిందా?
ఆదాని దేశంలోనే అత్యంత ధనికుడు. ఆయన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే కూడా వీరు రోదిస్తున్నారు. అరబిందో కంపెనీ ఫార్మా తదితర రంగాలలో ఎంత ప్రముఖ సంస్థో చెప్పనవసరం లేదు. అలాగే షిర్డి సాయి కంపెనీ అనుభవం కలిగిన సంస్థే. అలాంటివి వస్తుంటే లక్ష కోట్ల ప్రాజెక్టులు వారికి కట్టబెడతారా అని కేశవ్ ప్రశ్నిస్తున్నారు. ఆయన చెప్పిన మాటను జాగ్రత్తగా గమనిస్తే లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయని అంగీకరించినట్లయింది. తద్వారా చంద్రబాబు ఆరోపణలను పూర్వపక్షం చేసినట్లయింది. వైసీపీ వారిపై ఆరోపణలు చేసే బదులు టీడీపీ పారిశ్రామికవేత్తలు ఎవరైనా లేదా రామోజీరావు వంటివారు ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావచ్చుకదా! అలా చేయకపోగా వచ్చే వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
చదవండి: రామోజీ.. అస్మదీయ తకథిమి
రామోజీ కెందుకు అంత నొప్పి?
మరో వైపు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంటే కూడా ఈనాడు తెగ బాధపడుతోంది. మొదట అనుకున్న అంచనా పెట్టుబడి పెట్టడం లేదంటూ దిక్కుమాలిన వార్తలు రాస్తోంది. 8800 కోట్ల పెట్టుబడి తక్కువట. 6500 మందికి ఉపాధి కలిగిస్తే సరిపోదట. ఇదే పత్రిక తెలంగాణలో 570 కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయని మంత్రి కేటిఆర్ చెబితే మొదటి పేజీలో ఎక్కడా విమర్శ లేకుండా రాశారు. అది తప్పుకాదు. కాని అదే సమయంలో ఏపీలో మాత్రం లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను అడ్డుకునే రీతిలో కథనాలు ఇచ్చారు. ఏది ఏమైనా పయ్యావుల కేశవ్ కాని, ఈనాడు కానీ లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయని పరోక్షంగా అయినా అంగీకరించినందుకు వైసీపీ నేతలు ఆయనకు థాంక్స్ చెప్పాలి.
హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment