సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత జావేద్ ఇంటి వద్ద ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి అనుచరుడు వీరంగం సృష్టించాడు. డబ్బులు బాకీ ఉన్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత ఇంటి వద్ద అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. కుటుంబ సభ్యులను నిర్బంధించారని పోలీసులకు వైఎస్సార్‌సీపీ నేత జావేద్ ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత గోరాకు ఎలాంటి బాకీ లేనని జావెద్ స్పష్టం చేశారు.
హోంగార్డుపై టీడీపీ నేత దౌర్జన్యం
శింగనమల మండలంలోని ఉల్లికల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేత రంగారెడ్డి తనపై దాడికి ప్రయత్నించాడంటూ శింగనమల పీఎస్‌లో పనిచేస్తున్న హోంగార్డు నాగేంద్ర మంగళవారం సీఐ కౌలుట్లయ్యకు ఫిర్యాదు చేశారు. వివరాలు... సెప్టెంబరులో ఒక రోజు రాత్రి నాయనపల్లి క్రాస్ నుంచి మరువకొమ్మ వరకూ హెడ్ కానిస్టేబుల్ గిరి మహేష్‌తో కలసి, హోంగార్డు నాగేంద్ర గస్తీ విధులు నిర్వర్తించాడు.
ఆ సమయంలో టీడీపీ నేత ఉల్లికల్లు రంగారెడ్డికి చెందిన టిప్పరులో అక్రమంగా ఇసుక తరలిస్తుండడం గుర్తించి పోతురాజుకాలువ సమీపంలో అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. దీంతో అప్పటి నుంచి హోంగార్డు నాగేంద్ర ఎక్కడ కనిపించిన రంగారెడ్డి కోపంతో దుర్భాషలాడేవాడు. ఈ క్రమంలో మంగళవారం నాయనవారిపల్లిలో జరిగిన శుభకార్యానికి ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజు హాజరుకానుండడంతో ఎస్‌ఐ, ఎఎస్‌ఐ, హెడ్ కానిస్టేబులు, సిబ్బందితో ఎస్కార్ట్ విధుల్లో నాగేంద్ర కూడా పాల్గొన్నాడు. అక్కడ సిబ్బంది భోజనం చేస్తున్న సమయంలో నాగేంద్రపై రంగారెడ్డి దాడికి ప్రయతి్నంచాడు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది అడ్డుకోవడంతో నీ కథ చూస్తా అంటూ బెదిరిస్తూ వెళ్లిపోయాడు. టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐకి బాధితుడు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment