సాక్షి, అమరావతి: ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి టీడీపీ ఎంతకైనా తెగిస్తుందనడానికి గత సంఘటనలు ఎన్నో నిదర్శనంగా నిలిచాయి. ఈ కోవలో తాజాగా జంగారెడ్డిగూడెం అంశాన్ని తీసుకొని అబద్ధాన్ని ఎలాగైనా నిజం చేయాలని టీడీపీ పదేపదే ప్రయత్నిస్తోంది. ఇటు అసెంబ్లీలో, అటు బయట గందరగోళం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని ఆ పార్టీ శ్రేణులు వ్యూహం రూపొందించాయి. బుధవారం కూడా శాసనసభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు సభను అడ్డుకోజూశారు. వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని, సీఎం అసెంబ్లీలో అసత్యాలు మాట్లాడారంటూ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి అడ్డుతగిలారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంత వారించినా వినలేదు. దీంతో సభ ప్రారంభమైన 20 నిమిషాలకే స్వీకర్ అయిదు నిమిషాల విరామం ప్రకటించారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వారు అదే ధోరణి కొనసాగించారు. దీంతో స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం ఎటువంటి పదాలు వాడాలో తెలియడం లేదని అన్నారు. ఇలాంటి సభ్యులు ఉండటం ఖర్మ అని, సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిని కావడంతో సహనంతో ఉన్నానని, ఇంకొకరైతే ఈ పాటికి చర్యలు తీసుకునేవారని చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జోక్యం చేసుకుంటూ.. టీడీపీ బండారాన్ని గురువారం సభలో బయట పెడతానని అన్నారు. అప్పుడేం సమాధానం చెబుతారో చూద్దామంటూ సవాల్ విసిరారు. స్పీకర్ పదేపదే చెప్పినా తీరు మారకపోవడంతో ఇతర సభ్యుల హక్కుల పరిరక్షణ కోసం 11 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయిన అనంతరం సభ సజావుగా నడిచింది. అనంతరం నారాయణ స్వామి మాట్లాడుతూ.. వాస్తవాలను అంగీకరించడానికి ప్రతిపక్షం సిద్ధంగా లేదన్నారు. ప్రభుత్వం మీద బురదజల్లి రాజకీయ ప్రయోజనం పొందాలనే తాపత్రయమే వారిలో కనిపిస్తోందని చెప్పారు. వాస్తవాలను విస్మరించి, అబద్ధాలను నిజాలుగా నమ్మించడానికి నిస్సిగ్గుగా ప్రయత్నించడం జుగుప్స కలిగిస్తోందన్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై సభలో చర్చించకుండా, అల్లరి చేసి బురదజల్లడం మీదే ప్రతిపక్షం ఎక్కువ ఆసక్తి చూపిస్తోందని ఆయన విమర్శించారు.
వాయిదా తీర్మానం తిరస్కరణ
శాసన మండలిలో టీడీపీ సభ్యులు ముగ్గురిపై వైఎస్సార్‌సీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. దీనిని సభా హక్కుల కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు మండలి చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. అసెంబ్లీలో సీఎం జగన్ అసత్య ప్రకటనలు చేశారని, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలంటూ అంతకుముందు టీడీపీ సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేన్‌రాజు తిరస్కరించారు. అసెంబ్లీలో జరిగిన విషయంపై మండలిలో చర్య కోరడం సరికాదని చైర్మన్ చెప్పారు. అయినా టీడీపీ సభ్యులు పోడియం వద్ద నిలబడి ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సమావేశాలను టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై మంత్రి కన్నబాబు తీవ్రంగా స్పందించారు.
జంగారెడ్డిగూడెంలో పైడేటి సత్యనారాయణ (73) అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగానే చనిపోయారని, మద్యం వల్ల కాదని, ఒక్క రోజు కూడా మద్యం తాగని తమ తండ్రిని తాగుబోతుగా చిత్రీకరిస్తున్నారని ఆయన కుమారుడు శ్రీనివాస్, కుమార్తె నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ టీడీపీ శవ రాజకీయాలు మానడంలేదని కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లో కల్తీ నారా రాజకీయానికి పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది ముమ్మాటికీ సభా హక్కుల ఉల్లంఘన అని చెప్పారు. అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంపైన, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంపైన చర్చించే సమయంలో టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేయడం చూస్తే వారికి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని అర్థమవుతోందని మంత్రులు కన్నబాబు, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ తప్పుపట్టారు.
పెద్దల సభకు కొత్తగా ఎన్నికైన తమ హక్కులకు టీడీపీ సభ్యుల తీరుతో భంగం కలుగుతోందని వరుదు కళ్యాణి, దువ్వాడ శ్రీనివాసరావు, మొండితోక అరుణ్‌కుమార్, వంశీకృష్ణ, భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను టీడీపీ సభ్యులు మండలిలో వక్రీకరించి చెప్పారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. టీడీపీ సభ్యులు అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, అంగర రామ్మోహన్‌లపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును మండలి చైర్మన్‌కు అందజేశారు. ఇదిలా ఉండగా బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసన మండలి బుధవారం ఆమోదం తెలిపింది.
చంద్రబాబే కల్తీ: కన్నబాబు
సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా సృష్టిస్తున్న చంద్రబాబే కల్తీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వివర్శించారు. బుధవారం సచివాలయం ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలను కల్తీ సారా మరణాలంటూ జ్యుడిషియల్ విచారణ అడుగుతున్న లోకేష్‌కు సిగ్గుందా అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి, వారి తప్పేమీ లేదని నివేదిక రాయించుకున్నారని చెప్పారు. ఏర్పేడులో ఇసుక మాఫియా లారీ ప్రమాదం జరిగి 22 మంది చనిపోయారన్నారు.
ఈ రెండు సంఘటనల్లో చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పలేదని, బాధితులను ఓదార్చ లేదని, ఆర్థిక సాయం చేయలేదని, ఇప్పుడు మాత్రం రాజకీయ ర్యాలీలా జంగారెడ్డిగూడెం వెళ్లారని విమర్శించారు. బాధిత కుటుంబాలను సైతం టీడీపీ వారు బాధ పెడుతున్నారని చెప్పారు. ఇలాంటి చర్యలతో సీఎం జగన్ మనోధైర్యాన్ని అంగుళం కూడా సడలించలేరని మంత్రి స్పష్టం చేశారు. ఎస్‌ఈబీని నాటుసారా, అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకే తెచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment