పోలీస్ లాంఛనాలతో ఎస్‌ఐ గోపాలకృష్ణకు అంత్యక్రియల దృశ్యం
సాక్షి, అమరావతి/ఏలూరు టౌన్/పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట): రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా.. దాన్ని ప్రభుత్వానికి లింక్ పెడుతూ టీడీపీ చేస్తున్న ‘పచ్చ’ రాజకీయం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతి చిన్న విషయాన్ని ప్రభుత్వానికి అంటగడుతూ.. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ చేస్తున్న కుయుక్తులు ప్రజలందరికీ వెగటు పుట్టిస్తున్నాయి. కాకినాడ జిల్లా సర్పవరం ఎస్‌ఐ ముత్తవరపు గోపాలకృష్ణ మరణంపైన ఆ పార్టీ చేస్తున్న రాజకీయంపై ప్రజలు విస్తుపోతున్నారు. వాస్తవాలను మరుగున పరిచి.. కులం కార్డు తగిలించి రెచ్చగొట్టే చర్యలకు దిగడంపై పోలీసులు సైతం నివ్వెరపోతున్నారు.
బాబు జమానాలో పోలీసులకు పదోన్నతులు, పోస్టింగ్‌ల్లో కులం కార్డు చూశారనే తీవ్ర విమర్శలను ఆయన మూటగట్టుకున్నారు. చంద్రబాబు హయాంలో అనేక మంది పోలీసులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆ మరణాలపై అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎటువంటి రాజకీయ విమర్శలను చేయలేదని పలువురు గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి 2019 వరకు (టీడీపీ ప్రభుత్వ హయాంలో) మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన డొంకరాయిలో గోపాలకృష్ణ విధులు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాకే ఆయనకు రాజోలు, కాకినాడ టౌన్, కాకినాడ ట్రాఫిక్, సర్పవరం ఎస్‌ఐగా ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇవేమీ గుర్తించకుండా టీడీపీ నేతలు అవాస్తవాలను వండివార్చడంపై పోలీసులు మండిపడుతున్నారు.
చంద్రబాబు జమానాలో పోలీసుల అనుమానాస్పద మరణాలు..
♦చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి గన్‌మెన్ చంద్రశేఖర్‌రెడ్డి కడపలో 2017 సెప్టెంబర్‌లో అనుమానాస్పదంగా మృతి చెందారు. రివాల్వర్ శుభ్రం చేసుకుంటూ మిస్‌ఫైర్ అయినట్టు అప్పట్లో ప్రకటించారు.
♦2017 సెప్టెంబర్‌లో నెల్లూరు ఏఎస్పీ శరత్‌బాబు కారుడ్రైవర్‌గా ఉన్న కానిస్టేబుల్ రమేష్‌బాబు రివాల్వర్ కాల్పులతో మరణించారు.
♦2017 జనవరి 2న కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటనకు బందోబస్తుకు వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ హంపన్న చేతిలో ఏకే47 గన్ మిస్‌ఫైర్ అయ్యింది. తీవ్రగాయాలైన హంపన్నకు అత్యవసర వైద్యసేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు.
♦2016 జూన్ 16న పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ అనుమానాస్పదంగా మృతిచెందడం కలకలం రేపింది. ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ అయ్యి మరణించారని తొలుత భావించినప్పటికీ.. ఆయన కణతికి దగ్గర్లో కాల్చుకున్నట్టు ఉండటంతో ఆత్మహత్య అయి ఉండొచ్చని ఉన్నతాధికారులు భావించారు.
♦విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన తీరు అప్పట్లో అనుమానాలకు తావిచ్చింది.
♦ఢిల్లీలోని ఏపీ భవన్‌లో 2015 అక్టోబర్‌లో జరిగిన కాల్పుల్లో పోలీస్ అధికారి ఒకరు గాయపడగా అది మిస్‌ఫైర్‌గా విచారణలో నిర్ధారించారు.
పోలీస్ లాంఛనాలతో ఎస్‌ఐ గోపాలకృష్ణకు అంత్యక్రియలు
ఎస్‌ఐ గోపాలకృష్ణ మృతదేహానికి శనివారం ఆయన స్వగ్రామమైన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో పోలీస్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతదేహానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను నివాళులర్పించారు. పలువురు పోలీసులు గౌరవ వందనం చేశారు. శ్మశానవాటికలో పోలీస్ సిబ్బంది మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి అంత్యక్రియలు పూర్తి చేయించారు.
తప్పుడు కథనాలపై చర్యలు తప్పవు
గోపాలకృష్ణ మృతిపై కొన్ని టీవీ చానళ్లలో తప్పుడు కథనాలు వస్తున్నాయి. అటువంటి వాటిపై చర్యలు తప్పవు. పోస్టింగ్‌ల విషయంలో గోపాలకృష్ణకు ఎటువంటి అన్యాయం జరగలేదు. ఆయన మృతికి ఉన్నతాధికారుల వేధింపులు, పోస్టింగ్ కారణం కాదు. సున్నిత మనస్తత్వం కారణంగా పోలీస్ శాఖలో ఇమడలేకపోవడం, తన చదువుకు తగ్గ వృత్తిలోకి వెళ్లలేకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనైనట్టు సూసైడ్ నోట్‌లో గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు సైతం వెల్లడించారు.
– పాలరాజు, డీఐజీ, ఏలూరు రేంజ్
ఎస్‌ఐ మృతిపై రాజకీయం ఆపండి
ఎస్‌ఐ గోపాలకృష్ణ మృతిని రాజకీయం చేయడం ఆపాలి. కొందరి రాజకీయ నాయకుల వ్యాఖ్యలు పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
– జనకుల శ్రీనివాస్, అధ్యక్షుడు, ఏపీ పోలీసు అధికారుల సంఘం
రివాల్వర్ మిస్‌ఫైర్ వల్లే జరిగిందనుకుంటున్నాం..
రివాల్వర్ మిస్‌ఫైర్ కావడం వల్లే మా సోదరుడు గోపాలకృష్ణ మరణించి ఉండొచ్చు. ఆయనకు ఎటువంటి ఆర్థిక, కుటుంబపరమైన సమస్యలు లేవు. కొన్ని టీవీ చానల్స్‌లో వస్తున్న వార్తలు నిజం కాదు. పోలీసుల దర్యాప్తుపై మాకు పూర్తి నమ్మకముంది.
– సైదులు, మృతుడు ఎస్‌ఐ గోపాలకృష్ణ సోదరుడు
Comments
Please login to add a commentAdd a comment