
యూపీ సీఎం యోగి సమక్షంలో లక్నోలో రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేస్తున్న డాక్టర్ కె.లక్ష్మణ్
ముషీరాబాద్: రాజ్యసభ సభ్యుడిగా తనను నియమించడం ప్రతి కార్యకర్తకూ దక్కిన గౌరవంగా భావిస్తానని, కార్యకర్తలను గౌరవించే సంస్కృతి బీజేపీలోనే ఉందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. నామినేషన్ వేయడానికి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు బయలుదేరి వెళ్లేముందు మంగళవారం తెల్లవారుజామున ఆశోక్‌నగర్‌లోని తన నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు.
సోమవారం రాత్రి 10 గంటల సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి లక్నో బయలుదేరి రావాలని, రాజ్యసభ సభ్యుడిగా పార్టీ మిమ్మల్ని నియమించిందని చెప్పడంతో తాను మొదట ఆశ్చర్యానికి గురయ్యానని అన్నారు. తన మీద నమ్మకం ఉంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, అధ్యక్షుడు జె.పి.నడ్డా, కార్యదర్శి సంతోష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని ప్రాతినిధ్యం వహించే రాష్ట్రం నుంచి ఒక తెలుగువాడికి అవకాశం దక్కడం ఇదే మొదటిసారని ఆనందం వ్యక్తం చేశారు. ఎటువంటి రాజకీయ నేపధ్యం లేని కుటుం బం నుంచి వచ్చిన తనకు ఇంతటి అవకాశాలు కల్పించడం కార్యకర్తలందరికీ దక్కిన గౌరవమని పేర్కొన్నారు. తన పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచిన విధంగానే పార్టీ గౌరవాన్ని పెంచుతానన్నారు. తెలంగాణను, రాజకీయ భిక్ష పెట్టిన ముషీరాబాద్ ప్రజలను, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎప్పటికీ మరచిపోనని తెలిపారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.
లక్నోలో నామినేషన్ దాఖలు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మంగళవారం రాజ్యసభ అభ్యర్థిగా లక్నోలో నామినేషనల్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్, సీనియర్ నేత కేశవ్ ప్రసాద్ మౌర్యతో కలిసి ఆయన ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఉత్తరప్రదేశ్‌లోని 11 రాజ్యసభ సీట్లకు నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారమే గడువు. దీంతో లక్ష్మణ్‌సహా 8 మంది బీజేపీ అభ్యర్థులు లక్ష్మీకాంత్ వాజ్‌పేయి, మిథిలేశ్ కుమార్, రాధామోహన్ దాస్ అగర్వాల్, సురేంద్ర సింగ్ నాగర్, బాబూరామ్ నిషాద్, దర్శన సింగ్, సంగీత యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎనిమిది మంది ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు తెలిపాయి.