ఇద్దరూ ఒకే పార్టీలో వున్నారు. ఇద్దరివీ కీలక బాధ్యతలే.. ఇతర నాయకులకు మార్గదర్శకంగా వుండాల్సిన ఆ నేతలిద్దరూ నోరు జారుతున్నారు. నోటి దూలతో విమర్శలపాలవుతున్నారు. తమ మధ్యనున్న విభేదాలను అనుకోకుండానే బయట పెట్టుకుంటున్నారు. ఒకరేమో బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.. మరొకరేమో సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీలో కీలకనాయకునిగా గుర్తింపు పొందిన హుజారాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈ ఇద్దరు కమలదళం నేతల చిట్ చాట్లు, మీడియా మీట్లు బీజేపీకి లేనిపోని తలనొప్పులు తెస్తున్నాయి.
పార్టీ రథసారథిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీకి ఒక ఊపు తీసుకొచ్చిన సంజయ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే అధికార బిఆర్ ఎస్ ఎన్ని ఎత్తుగడలు వేసినా సరే వాటిన్నిటినీ తిప్పికొట్టి ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటిన ఈటెల రాజేందర్ రాష్ట్ర కమలదళంలో జోష్ నింపారు. అటు హైకమాండ్ దగ్గర ఇటు జనాల్లో తమదైన స్టయిల్లో పేరు సంపాదించుకున్న ఈ ఇద్దరు నేతలు తాము సాధించిన గుర్తింపును నిలుపుకోవడంలో విఫలమవుతున్నారనే విశ్లేషణలు రాజకీయ విశ్లేషకులనుంచే కాదు.. సొంతపార్టీ నుంచే వెలువడుతున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు నేతలూ బీఆర్‌ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక వ్యవహారంలో నోరు జారి ఆ తర్వాత నాలుక్కర్చుకోవడం తాజాగా చర్చనీయాంశమవుతోంది. చేరికల కమిటీ అధ్యక్షుడి హోదాలో ఈటెల రాజేందర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారట కదా అని విలేకర్లు బండి సంజయ్ ని అడిగితే.. ఓ రాష్ట్ర పార్టీ చీఫ్ గా ఔననో, తనకింకా పూర్తి సమాచారం అందాల్సి ఉందనో ఆ సమయానికి ఆయన లౌక్యంగా సమాధానం ఇవ్వాలి.
కనీసం నెగటివ్ కామెంట్లకు, అనుమానాలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలి . కానీ ఆయన ఆ పని చేయలేదు. తనకు ఆ విషయంపై అంటే పొంగులేటితో ఈటల చర్చలపై అసలు సమాచారమే లేదంటూ బండి సంజయ్ బ్లంట్‌గా చేసిన వ్యాఖ్యలు.. ఇంటా, బయటా చర్చనీయాంశమయ్యాయి. పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన తరుణంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఈటెల రాజేందర్‌తో గ్యాప్ ఉందనే ప్రచారాన్ని బలపర్చేలాగా వున్నాయి. గతంలో ఎమ్మెల్సీ కవితపైనా అలాగే మాట తూలిన బండి సంజయ్ .. తన సొంత పార్టీ ఎంపీ అరవింద్ నుంచి విమర్శలెదుర్కొన్నారు. మంచి మాటకారిగా.. ఆచితూచి మాట్లాడే నేతగా పేరున్న ఈటెల రాజేందర్ కూడా చేరికల కమిటీ అధ్యక్షుడి హోదాలో చేస్తున్న వ్యాఖ్యలూ బండి సంజయ్ తరహాలోనే ఉండటం చర్చనీయాంశమవుతున్నాయి.
బిజెపిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డే తనకు కౌన్సిలింగ్ ఇచ్చారని ఖమ్మంలో కాంగ్రెస్సే బలంగా ఉందంటూ ఈటెల రాజేందర్ చిట్ చాట్‌గా చేసిన వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. చేరికల కమిటీ అధ్యక్షుడు రాజేందరే అలా వ్యాఖ్యలు చేయడం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి ఉపయోగపడకపోగా.. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు అవకాశం కల్పించేలా వున్నాయి.
తన చిట్ చాట్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించడంతో నాలుక్కర్చుకున్న ఈటెల రాజేందర్.. ఆ తర్వాత తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారంటూ తానే ఖండన ఇచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అవకాశం దొరికితే ఇరుకున పెట్టే హరీష్‌రావు లాంటి వాళ్లు అదే అదనుగా రెచ్చిపోయి బీజేపీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ అంటే సహించలేని సొంత పార్టీ నేత విజయశాంతి లాంటివారు కూడా ఈటలపై కౌంటర్స్ వేసే పరిస్థితి వచ్చింది.
ఇలా బండి సంజయ్, ఈటెల రాజేందర్ మాటలు తూలుతుండటంతో బీజేపీ నేతల్లో, కార్యకర్తల్లో అసహనం పెల్లుబుకుతోంది. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని భావించి ఆ పార్టీలో చేరాలనుకుంటున్నవారు పునరాలోచించుకునేలా బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యవహార శైలి వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు కీలక నేతల మధ్యన ఏర్పడిన గ్యాప్, అభిప్రాయ భేదాలు ఆ ఇద్దరికి ఎంత నష్టం తెస్తాయో ఏమోగానీ...కాషాయ పార్టీకి మాత్రం పెద్ద దెబ్బే పడుతుందని వారు అంటున్నారు.
చదవండి: టీడీపీలో అరాచక నేతలు
Comments
Please login to add a commentAdd a comment