సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్ని కల్లో టీఆర్‌ఎస్‌కే మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని భావిస్తున్నట్టు సమాచారం. రెండు పార్టీలకు కలిపి మునుగోడు నియోజకవర్గంలో 25 వేలకుపైగానే ఓటింగ్ ఉంటుందని, ఇది ఇతరపార్టీల విజయావకాశాలను ప్రభావితం చేస్తు ందని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు చివరిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న దానిపై చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్‌కు దూరమే!
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదన్న ఆలోచనలో ఉన్నట్టు సీపీఐ నేత ఒకరు పేర్కొ న్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరుతున్నందున.. కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలుతాయని, ఆ పార్టీకి వామపక్షాలు మద్దతిచ్చినా బీజేపీనే లాభపడుతుందని ఆయన విశ్లేషించారు. ఇక కొంతకాలం నుంచి బీజేపీ, ప్రధాని మోదీల తీరుపై సీఎం కేసీఆర్ విరుచుకుపడుతున్నారు.
బీజేపీని దీటుగా ఎదుర్కోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని వామపక్షాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇప్పుడు మునుగోడులో టీఆర్‌ఎస్‌కు ఇచ్చే మద్దతుతో కుదిరే పొత్తు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగే అవకాశముంటుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల్లో కొత్తగూడెం, భద్రాచలం, మిర్యాలగూడ, ఖమ్మం లేదా పాలేరు నియోజకవర్గాలను తమకు కేటాయించాలని వామ పక్షాలు కోరే చాన్సుందని అంటున్నాయి.
టీఆర్‌ఎస్ నేతలతో చర్చలు షురూ..
బీజేపీకి బ్రేక్ వేయడంపై అధికార టీఆర్‌ఎస్ గట్టిగా దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ విధానాలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న సీపీఐ, సీపీఎంల మద్దతు తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొంటున్నాయి. తమ పార్టీ నేతలను చర్చలకు రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారని.. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తమ నేతలతో మాట్లాడారని సీపీఐ, సీపీఎం నేతలు వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్‌నేత మల్లు రవి కూడా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను కలిసి తమకు మద్దతివ్వాలని కోరినట్టు సమాచారం. బీజేపీని ఓడించగల పార్టీకే మద్దతు ఇస్తామని తమ్మినేని స్పష్టం చేసినట్టు తెలిసింది.
రాష్ట్రస్థాయి సమావేశాల్లో చర్చలు
మునుగోడు ఎన్నిక విషయంగా సీపీఐ, సీపీఎం రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సీపీఎం రాష్ట్ర కమిటీ, రాష్ట్ర కార్యదర్శివర్గం భేటీలు శుక్రవారం జరుగగా.. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ విస్త్రృతస్థాయి సమావేశాలు శనివారం కూడా కొన సాగనున్నాయి. ఈ సమావేశాల్లో మునుగోడులో ఎలా వ్యవహరించాలన్న దానిపై నేతలు చర్చించారు. నిజానికి మునుగోడులో పలుసార్లు సీపీఐ అభ్య ర్థులు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆ పార్టీకి కేడర్, ఓటు బ్యాంకు ఉంది. సీపీఎంకు కూడా కొంత ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలో కొందరు సీపీఐ నేతలు పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలని, టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడం ఏమేరకు సమంజసమని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే గతంలో గెలిచినప్పుడు పొత్తుల వల్లే సాధ్యమైందని, పైగా నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఓటు బ్యాంకు తగ్గిందని మరికొందరు పేర్కొన్నట్టు సమాచారం.
అన్ని అంశాలను పరిశీలించి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడమే సరైనదని ఆ పార్టీ పెద్దలు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇక సీపీఎం కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టవచ్చన్న అంచనాకు వచ్చినట్టు సమాచారం. తమ నిర్ణయాన్ని ఇప్పుడు ప్రకటించాలా, ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చాక చెప్పాలా అన్నదానిపై ఇంకా స్పష్టతకు రాలేదని తెలిసింది. ఇప్పటికిప్పుడు టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తే ఎన్నికల నాటికి సమీకరణాలు ఎలా మారుతాయోనన్న ఆలోచన ఉన్నట్టు సమాచారం. అందువల్ల రెండు పార్టీల సీనియర్లు సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment