సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఎర అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ సర్కస్ ఆడుతోందని, రాష్ట్రంలో బెంగాల్ ఫార్ములా అమలుకు బీజేపీ కుట్ర చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఏదో ఒక విషయాన్ని వివాదాస్పదం చేసి తెలంగాణలో శాంతి భద్రతల సమస్య తెచ్చేందుకు బీజేపీ పన్నాగం పన్నిందన్నారు.
పార్టీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీలు వి.గంగాధర్‌గౌడ్, రాజేశ్వర్‌రావుతో కలిసి శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నామని, ఆయన చేసిన వ్యాఖ్యలతో పోలిస్తే కవిత తిట్టింది చాలా తక్కువని వ్యాఖ్యానించారు. సంస్కారం లేకుండా రాజకీయాలకే కళంకంగా మారిన అర్వింద్ తన తీరు మార్చుకోవడం లేదని, ఆడబిడ్డను కేసీఆర్ అమ్ముకుంటున్నారని నీచ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కవితపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే అభిమానులు సహిస్తారా అని మంత్రి ప్రశ్నించారు.
మహిళా గవర్నర్ ఏం చేస్తున్నారు?
కేసీఆర్ తన బిడ్డను అమ్ముకుంటున్నారని ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై మహిళా గవర్నర్ ఏం చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే రాష్ట్రంలో రాజకీయాల స్థాయి దిగజారిందన్నారు. కేసీఆర్ ఫెయిల్యూర్ సీఎం అంటూ విమర్శలు చేస్తున్న బండి సంజయ్‌కి సక్సెస్, ఫెయిల్యూర్‌కు నడుమ తేడా తెలుసా అని ప్రశ్నించారు.
మునుగోడు ఓటమి నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోలేదన్నారు. అర్వింద్ ఇంట్లో మూడు పార్టీలకు చెందిన నేతలున్నారని, కాంగ్రెస్‌తో కుమ్మక్కు కావడం వల్లే ఆయన ఎంపీగా గెలుపొందారని ఆరోపించారు. అర్వింద్ భాషపై పౌర సమాజం, మీడియా కూడా స్పందించాలని మంత్రి వేముల కోరారు. బీజేపీ నేతల తిట్లతో పోలిస్తే అరవింద్ ఇంటిపై జరిగిన దాడి ఘటన చాలా చిన్నదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బెంగాల్ తరహా కుట్రలను బీజేపీ అమలు చేయాలని చూస్తోందని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ ఆరోపించారు. అర్వింద్ మొదటి నుంచి తప్పుడు మార్గంలో ఉన్నారని, కాంగ్రెస్‌లో బీ ఫారాలు అమ్ముకున్న చరిత్ర ఉందని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment