‘సార్‌’ ఊరు నుంచే ‘కారు’ పతనం | Telangana: TPCC Chief Revanth Reddy Slams On CM KCR | Sakshi
Sakshi News home page

‘సార్‌’ ఊరు నుంచే ‘కారు’ పతనం

Published Sun, May 22 2022 12:42 AM | Last Updated on Sun, May 22 2022 12:54 AM

Telangana: TPCC Chief Revanth Reddy Slams On CM KCR - Sakshi

దళితరైతు జానీ ఇంట్లో భోజనం చేస్తున్న రేవంత్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘మాట తప్పిన సీఎం కేసీఆర్‌ను దంచుడే.. గద్దె దించుడే. 12 నెలల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్‌ను బొందపెట్టి ధరణి పోర్టల్‌ను గంగలో కలుపుతాం’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రచ్చబండ కార్యక్రమానికి తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్వగ్రామం హనుమకొండ జిల్లా అక్కంపేట నుంచి శనివారం శ్రీకారం చుట్టారు.

హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రచ్చబండలో రేవంత్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వరాష్ట్ర కాంక్షకు ఉద్యమ ఊపిరిలూదిన అక్కంపేట గ్రామం నుంచే టీఆర్‌ఎస్‌ పతనానికి రైతులతో కలిసి కదులుతున్నానని చెప్పారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతామన్నారు.  

అక్కంపేటను కాంగ్రెస్‌ దత్తత తీసుకుంటుంది 
తెలంగాణ ఏర్పాటు కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌కు కనీసం ఓ విగ్రహాన్ని కూడా కేసీఆర్‌ పెట్టలేదని రేవంత్‌ మండిపడ్డారు. జయశంకర్‌ సార్‌తో పాటు ఆయన సొంతూరు అక్కంపేటను ప్రజలు మరిచిపోయేలా కుట్రతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2,550 పైచిలుకు ఓట్లున్న ఊరును కనీసం రెవెన్యూ గ్రామంగా మార్చలేదన్నారు.

‘అక్కంపేటను అది చేస్తాం.. ఇది చేస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాలయాపన చేశారే తప్పే చేసిందేం లేదు. వారంతా తడిగుడ్డతో గొంతుకోసే రకం’అని విమర్శించారు. గ్రామాన్ని కాంగ్రెస్‌ దత్తత తీసుకుంటుందని, అధికారంలోకి వచ్చాక రాహుల్‌గాంధీని గ్రామానికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు.  

రైతులే నా సైన్యం 
‘రైతులే నా సైన్యం.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపడమే నా గమ్యం. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను గ్రామగ్రామానికి తీసుకెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ మొదలుపెట్టాం’అని రేవంత్‌ చెప్పారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు ల్యాండ్‌ పూలింగ్‌ రైతులు రేవంత్‌ను కలవగా పూలింగ్‌కు వ్యతిరేకంగా తిరగబడాలని చెప్పారు. రింగ్‌ రోడ్డు పేరిట భూములు పోకుండా కాపాడుకునేందుకు రైతులతో కలిసి వస్తానని చెప్పారు.  

దళిత రైతు ఇంట్లో భోజనం  
అక్కంపేటకు చేరుకోవడానికి ముందు అగ్రంపహాడ్‌లో సమ్మక్క సారలమ్మలను గద్దెలను రేవంత్‌ సందర్శించి పూజలు చేశారు. తర్వాత అక్కంపేటలో జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దళిత కాలనీకి వెళ్లి చిలువేరి రైతు జానీ ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత గ్రామంలో పలువురి ఇళ్లకు వెళ్లి రైతు డిక్లరేషన్‌ గురించి వివరించారు.

‘ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు వచ్చాయా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా?’అని అడిగి తెలుసుకున్నారు. తర్వాత గ్రామ నడిబొడ్డున రావిచెట్టు కింద పోచమ్మ గుడి వద్ద పార్టీ జెండాను ఎగరేసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కాగా, పరకాల నియోజకవర్గంలో రేవంత్‌ పర్యటనలో కొండా దంపతులు పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు వేం నరేందర్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, గండ్ర సత్యనారాయణ, మాజీ ఎర్రబెల్లి స్వర్ణ, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, ఇనగాల వెంకట్రాంరెడ్డి, దొమ్మాటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement