హిమాయత్‌నగర్(హైదరాబాద్): టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై దేశంలోనే అత్యధికంగా పన్నులు వసూలు చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తాజాగా కేంద్రం పన్నులు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కోవిడ్ సమయంలో తలెత్తిన పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయని, ఆ ప్రభావం అమెరికా వంటి దేశాలతో పాటు భారత్‌పై కూడా పడిందని ఆయన పేర్కొన్నారు.
అందుకే దేశవ్యాప్తంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చాయన్నారు. కొద్ది రోజుల కిందట కూడా వివిధ రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై సెస్‌ను తగ్గించినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించలేదని విమర్శించారు. ఆదివారం నారాయణగూడలోని కేఎంఐటీ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజల బాధలు తెలుసుకొని పెట్రోల్, డీజిల్‌ల ధరలు తగ్గించడం వల్ల ఎంతోమందికి ఉపశమనం కలిగిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం వల్లే పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం పన్నులు తగ్గించిందని కొందరు ప్రచారం చేసుకుంటున్నారని, ఇది హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని రైతులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్, పంజాబ్ రైతులను కలుస్తూ ఏదో సాధించినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ అమెరికా అధ్యక్షుడిని కలసినా, పాకిస్తాన్ అధ్యక్షుడిని కలసినా తామేమీ భయపడమన్నారు. గతంలో కేసీఆర్ చెప్పిన సంచలనాలన్నీ ఆయన ప్రగతిభవన్‌కే పరిమితం అయ్యాయని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment