సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతల ఎన్నికల ప్రచారం ఆ పార్టీ అభ్యర్థులకు మిశ్రమ ఫలితాన్నిచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరికొన్ని చోట్ల పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది అక్టోబర్18న తన సోదరి ప్రియాంకతో కలిసి వరంగల్ జిల్లాకు వచ్చిన రాహుల్ ప్రచారం నిర్వహించిన ములుగు, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
రాహుల్ వెళ్లిన భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, బోధన్, వేములవాడ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్లినప్పటికీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమి పాలు కావడం గమనార్హం. ప్రియాంక వెళ్లిన కొడంగల్, ఖానాపూర్, పాలేరు, ఖమ్మం, మధిర స్థానాల్లో గెలవగా, జహీరాబాద్, మల్కాజ్‌గిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
రాహుల్ వెళ్లిన కామారెడ్డి, ఆదిలాబాద్‌లోనూ పార్టీ అభ్యర్థి ఓడిపోగా, ఆంధోల్‌లో విజయం సాధించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రాహుల్ ప్రచారం చేసిన జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్‌గిరి స్థానాల్లో అభ్యర్థులు ఓడిపోయారు. ఖర్గే హాజరైన నల్లగొండలో కోమటిరెడ్డి భారీ మెజార్టీతో గెలవగా, ఆలంపూర్‌లో సంపత్‌కుమార్ పెద్ద తేడాతో ఓటమి పాలయ్యారు. గతంలో సోనియాగాంధీ సభ నిర్వహించిన తుక్కుగూడలో పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం) భారీ మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం
Comments
Please login to add a commentAdd a comment