మునుగోడులో మగ్గం నేస్తున్న షర్మిల
మునుగోడు: ‘రాష్ట్ర ప్రజల సమస్యలను పరిశీలించేందుకు నేను పాదయాత్ర చేస్తుంటే, ఏ గ్రామంలోనూ సమస్యల్లేవని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేస్తున్నారు. మీ మాటలు నిజమైతే, మీకు ధమ్మూధైర్మం ఉంటే నాతోపాటు పాదయాత్రలో పాల్గొని సమస్యలు లేవని చూపించండి. అప్పుడు నేను ముక్కు నేలకు రాసి పాదయాత్ర ముగించి ఇంటికిపోతా. అదే నేను అంటున్నట్లు సమస్యలు ఉంటే మీరు పదవులకు రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా?’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సవాల్ చేశారు.
షర్మిల ప్రజాప్రస్థానయాత్ర ఆదివారం నల్లగొండ జిల్లా చండూరు, మునుగోడు మండలాల్లో సాగింది. చండూరు మండలం తాస్కానిగూడెంలో రైతు రామచందర్‌కు చెందిన పొలంలో వరి పంటను కోసి సాధకబాధకాలు తెలుసుకున్నారు. అనంతరం మునుగోడు మండలానికి పాదయాత్ర సాగింది. మునుగోడు అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన సభలో టీఆర్‌ఎస్ పాలనాతీరుపై నిప్పులు చెరిగారు.
కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపొయిందని, టీఆర్‌ఎస్ నాయకుడే పదేళ్ల బాలికపై లైంగికదాడి చేశారని విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగఖాళీలను భర్తీ చేయకుండా కేవలం తన కుటుంబంలో ఉన్న ముగ్గురికి ఉద్యోగాలిచ్చి రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్నారని
ఆరోపించారు.
రూ.40 లక్షలకు రూ.4 లక్షల పరిహారమా?
డిండి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టకుండానే చెర్లగూడెం, కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్ల పను లు మొదలుపెట్టి 600 మంది రైతుల భూములను లాక్కున్నారని షర్మిల ఆరోపించారు. మార్కెట్‌లో ఎకరానికి రూ.40 లక్షలుంటే రూ.4 లక్షల పరిహారం ఇస్తారా.. అని ప్రశ్నించారు. చేనేత కార్మికులు నేసిన దుస్తులకు మద్దతుధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. మునుగోడులోని ఓ కార్మికుడి ఇంటికి వెళ్లి మగ్గంనేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
దివంగత సీఎం వైఎస్ హయాంలో చేనేతలకు పావలా వడ్డీ రుణాలతోపాటు సబ్సిడీకి నూలు, రంగులు అందించారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అదే పద్ధతిలో ముడి సరుకులు అందించాలని షర్మిల అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, నేతలు మేకల ప్రదీప్‌రెడ్డి, జిల్లపల్లి వెంకటేశ్‌రావు, ఏపూరి సోమన్న, ఝాన్సీ రెడ్డి, బి.సుజాత, రహీమ్ షరీఫ్, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment