వనపర్తి సభలో అభివాదం చేస్తున్న వైఎస్ షర్మిల
వనపర్తి: మహిళలపై అత్యాచారాలు, మద్యం విక్రయాల్లో దక్షిణ భారతంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజా ప్రస్థాన పాదయాత్రలో భాగంగా శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు.
తెలంగాణలో ప్రజలు అంటే ఎన్నికల్లో ఓట్లు వేసే మిషన్లుగానే చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ కూడా ఉద్ధరించిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఒక దొంగ, బ్లాక్‌మెయిలర్‌ను పీసీసీ చీఫ్‌గా చేసిందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉందని, సీఎం ఆడించినట్లు రేవంత్ ఆడతారని విమర్శించారు. బీజేపీ మత పిచ్చి పార్టీ అని, ప్రజల మధ్య మతం పేరుతో మంట పెట్టి, చలి కాచుకునే రకమన్నారు.
రాష్ట్ర ప్రజలపై రూ.4 లక్షల కోట్లు అప్పు తెచ్చి పెట్టారని, బంగారు తెలంగాణ అని చెప్పి బతకలేని తెలంగాణగా చేశారన్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడేందుకే వైఎస్సార్‌టీపీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాను నిరుద్యోగుల పక్షాన దీక్షలు చేస్తోంటే.. మంత్రి నిరంజన్‌రెడ్డి తనను మంగళవారం మరదలు అని సంబోధించాడని, ఆయనకు అధికార మదం ఎక్కిందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment