సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘తెలంగాణలో అసలు సమస్యలే లేవని చెబుతున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఒకరోజు నాతోపాటు పాదయాత్రలో పాల్గొనాలి. సమస్యలు లేకపోతే నేను ముక్కు నేలకు రాసి, పాదయాత్ర నిలిపేసి ఇంటికి వెళ్లిపోతా. ఒకవేళ సమస్యలుంటే మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పదవులకు రాజీనామా చేసి, దళితుడిని సీఎం చేయాలి. దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించండి’ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా సోమవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు.
బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తే వేలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. కానీ, బీజేపీతో సత్సంబంధాలు ఉన్నందునే కేసీఆర్ ఈ విషయంపై కేంద్రాన్ని ఒత్తిడి చేయడంలేదని విమర్శించారు. ‘నక్కలు ఎరుగని బొక్కలు లేవు.. పాములు ఎరుగని పుట్టలు లేవు’ అన్న చందంగా కేసీఆర్ మోసం చేయని వర్గం రాష్ట్రంలో లేదని సీఎం హామీలపై ఆమె సెటైర్లు పేల్చారు. రీడిజైనింగ్ పేరుతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇంతవరకు ఒక్క ఎకరాకూ నీరందలేదన్నారు.
ఒకప్పుడు రూ.3 వేల కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్న సింగరేణి, ఇప్పుడు రూ.8 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని షర్మిల అన్నారు. 60 వేల ఉద్యోగులున్న ఈ సంస్థలో ప్రస్తుతం 40 వేలమంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. పాదయాత్రలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నరాల సత్యనారాయణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ గడిపల్లి కవిత, రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment