సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీ ఈసారి రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు పెద్ద సంఖ్యలో టికెట్లివ్వలేదు. నారీ శక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించినప్పుడు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు మద్దతిచ్చాయి. సీట్ల కేటాయింపులో మాత్రం ఆ స్ఫూర్తి ప్రతిఫలించలేదు. ఈ నెల 25న పోలింగ్ ప్రక్రియకు సిద్ధమైన రాజస్తాన్‌లోని 81 స్థానాల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా బరిలో లేరని గణాంకాలు చెబుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 200 స్థానాలకు గాను మొత్తం 1,875 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 1,692 మంది పురుషులు, 183 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ 28 (14%) మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టగా, బీజేపీ 20 (10%) మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 189 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా 24 మంది విజయం సాధించారు.
ఈసారి బరిలో బీజేపీకి చెందిన ప్రముఖ మహిళా అభ్యర్థులలో మాజీ సీఎం వసుంధర రాజే సింధియా, బికనీర్ ఎమ్మెల్యే సిద్ధి కుమారి, మాజీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనితా భాదేల్, రాజ్‌సమంద్ ఎమ్మెల్యే దీప్తి మహేశ్వరి, రాజ్‌సమంద్ ఎంపీ దియా కుమారి ఉన్నారు. కాగా, కాంగ్రెస్‌లో మాల్వియా నగర్ నుంచి అర్చన శర్మ, చోము నుంచి షికా మీల్ బరాలా, ప్రస్తుత మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మమతా భూపేష్, కామా నుంచి జాహిదాలకు ఉన్నారు. ఈ మహిళా అభ్యర్థులలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగా... అల్వార్‌లోని రామ్‌గర్గ్ జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సఫియా జుబేర్ స్థానంలో ఆమె భర్త జుబేర్ అహ్మద్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment