
సాక్షి, హైదరాబాద్: ఏడాది చివరలో జరిగే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం బీఆర్‌ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా పార్టీ ప్రతినిధులతో ప్లీనరీ నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ ఈ ఏడాది మాత్రం కేవలం సర్వసభ్య సమావేశానికే పరిమితం కావాలని నిర్ణయించింది. వేసవి తీవ్రత, వరికోతలు, అకాల వర్షాలు తదితరాలను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో ప్రతినిధులతో తెలంగాణ భవన్‌లో నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో సుమారు 6వేల మంది ప్రతినిధులతో టీఆర్‌ఎస్... బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తొలుత భావించినా సర్వసభ్య సమావేశానికే పరిమితం చేశారు. బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు జిల్లా పరిషత్, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ రాష్ట్రకార్యవర్గంతోపాటు జిల్లా శాఖ అధ్యక్షులు కలుపుకొని మొత్తంగా 300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
బీఆర్‌ఎస్ జాతీయ పారీ్టగా మారినా సర్వసభ్య సమావేశానికి మాత్రం రాష్ట్రానికి చెందిన వారినే ఆహ్వానించారు. గురువారం ఉదయం 10 గంటలకల్లా తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని వారం క్రితమే ఆహ్వానాలు వెళ్లాయి. ఉదయం 11 గంటలకు కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఎగురవేసి సమావేశాన్ని ప్రారంభిస్తారు.
తీర్మానాలపై కసరత్తు
కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సర్వసభ్య సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి విస్తృతంగా చర్చించి ఆమోదించేలా ఎజెండా రూపొందించారు. ప్రవేశపెట్టే తీర్మానాలపై ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం కసరత్తు చేస్తోంది. అయితే ఈ తీర్మానాలపై గురువారం ఉదయానికి స్పష్టత వస్తుందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
రెండు రోజుల క్రితం నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభల్లో ఆరు ప్రధాన అంశాలపై తీర్మానాలు జరిగాయి. వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి–పట్టణ ప్రగతి, విద్య–ఉపాధి, బీజేపీ వైఫల్యాలు, స్థానిక అంశాలపై తీర్మానాలు చేయగా.. సర్వసభ్య సమావేశంలోనూ ఈ అంశాలకు పెద్దపీట వేసే అవకాశముంది. ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ తీర్మానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆత్మీయ సమ్మేళనాల ద్వారా ఇప్పటికే ఎన్నికల సన్నద్ధతను ప్రారంభించిన బీఆర్‌ఎస్ వచ్చే నెల నుంచి విద్యార్థి, యువజన సమ్మేళనాలు కూడా నిర్వహించేదుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అక్టోబర్ 10న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ ప్రకటించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో నిర్వహించే సభలు, సమావేశాలపై కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశముంది. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికలు లక్ష్యంగా పార్టీ యంత్రాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపే రీతిలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.