ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు
ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా.. బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ రంజుగా మారింది. ఒకరికొకరు సై అంటే సయ్యంటూ ప్రచారం సాగించారు.
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,15, 801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుష ఓటర్లు 1,51, 673 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,64, 006 మంది ఉండగా, ట్రాన్స్ జెండర్లు 47 మంది ఉన్నారు. ఇందులో సుమార 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. మొత్తం ఓట్లలో కమ్మ ఓట్ల సంఖ్య తక్కువే అయినా... ఆ సామాజికవర్గం ఇతరులను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనాతోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అందుకే వారి ఓట్లు, వారు ప్రభావితం చేయగలిగే ఓట్లే ఖమ్మం సీటులో గెలుపు ఓటముల్లో కీలకంగా మారే అవకాశం ఉంది.
అటు గులాబీ పార్టీ.. ఇటు హస్తం పార్టీల అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గం వారే కావడంతో ఆ వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ ఖమ్మంలో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే నువ్వా నేనా అన్న రీతిలో ముఖాముఖీ తలపడ్డాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు.
ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు.
ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడ్డారు. ఇక బీజేపీ-జనసేనల పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు టికెట్ కేటాయించారు. జనసేన తరఫున మిర్యాల రామకృష్ణ బరిలో నిలిచారు. ఇక సీపీఎం నుంచి యర్ర శ్రీకాంత్ పోరుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం నేరుగా పోరుకు దిగింది.
Comments
Please login to add a commentAdd a comment