అవినీతి వల్లే చార్జీల పెంపు  | TPCC Chief Revanth reddy Demands discoms money in ERC Public Inquiry | Sakshi
Sakshi News home page

అవినీతి వల్లే చార్జీల పెంపు 

Published Sat, Feb 26 2022 2:34 AM | Last Updated on Sat, Feb 26 2022 2:49 AM

TPCC Chief Revanth reddy Demands discoms money in ERC Public Inquiry - Sakshi

విచారణ కార్యక్రమంలో మాట్లాడుతున్న రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఎత్తిపోతల పథకాలు, ఇతర ఉచిత విద్యుత్‌ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే ఏటా సుమారు 30% విద్యుత్‌ను వాడుకుంటోంది. ఇందుకు రూ. 16 వేల కోట్లను విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించాల్సి ఉండగా రూ. 5,652 కోట్లనే సబ్సిడీగా ఇస్తోంది. మిగతా రూ. 10 వేల కోట్లను రాష్ట్ర ప్రజలే చెల్లించాల్సి రానుంది. ప్రభుత్వ ఆస్తులు జప్తు చేసైనా ఈ బకాయిలు వసూలు చేయాలి. ప్రజలపై భారం వేసే చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలి’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,631 కోట్ల విద్యుత్‌ చార్జీల పెంపునకు డిస్కంలు సమర్పించిన టారిఫ్‌ ప్రతిపాదనలపై ఈఆర్సీ చైర్మన్‌ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎం.డి. మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్య శుక్రవారం హైదరాబాద్‌లో బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతోపాటు రైతులు, వినియోగదారులు, పారిశ్రామిక సంఘాలు తమ వాణిని వినిపించాయి. రేవంత్‌ మాట్లాడుతూ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల నిర్వహణలో తప్పిదాలు, ప్రభుత్వ అవినీతి వల్లే డిస్కంలు విద్యుత్‌ చార్జీలు పెంచాల్సి వచ్చిందని మండిపడ్డారు. విద్యుత్‌ చార్జీల పెంపునకు డిస్కంలు చేసిన ప్రతిపాదనలను తిరస్కరించాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశారు. 

డిస్కంలు దివాలా..! 
‘ఉదయ్‌’ పథకంలో చేరడంతో 2014–15లో డిస్కంల అప్పులు రూ. 11 వేల కోట్ల నుంచి రూ. 2,234 కోట్లకు తగ్గాయని, కానీ 2022 నాటికి ఏకంగా రూ. 60 వేల కోట్లకు పెరిగాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుకు అడ్డగోలుగా అప్పులు చేయడంతో డిస్కంలు ఆర్థికంగా దివాలా తీశాయన్నారు. జనరేటర్లకు రూ. వేల కోట్ల బకాయిలు చెల్లించలేక చేతులెత్తేశాయని చెప్పారు. జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించి ప్రైవేటు నుంచి అధిక రేటుతో ప్రభుత్వం విద్యుత్‌ కొనడం వల్ల వినియోగదారులపై రూ. వేల కోట్ల భారం పడిందని ఆరోపించారు. 

‘భద్రాద్రి’ వ్యయాన్ని ఆమోదించొద్దు: శ్రీధర్‌బాబు 
భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణ వ్యయం భారీగా రూ. 8,536 కోట్లకు పెరిగిందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ వ్యయాన్ని ఆమోదించరాదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు. గృహాలపై డిస్కంలు అడ్డగోలుగా రూ. 8 వేల వరకు డెవలప్‌మెంట్‌ చార్జీలు వేస్తున్నాయని తప్పుబట్టారు. విద్యుత్‌ చార్జీలు పెంచకుండా ప్రభుత్వ సబ్సిడీలు పెంచడం ద్వారా డిస్కంల ఆర్థిక లోటును పూడ్చాలని సూచించారు. 
     ప్రస్తుతం ప్రతిపాదించిన రూ. 6,831 కోట్ల చార్జీల పెంపునకు తోడుగా భవిష్యత్తులో గత ఐదేళ్లకు సంబంధించిన ట్రూఅప్‌ చార్జీలను సైతం వసూలు చేస్తామని డిస్కంలు పేర్కొనడంతో రూ. 50 వేల కోట్లకుపైగా చార్జీల పెంపు భారాన్ని ప్రజలపై వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సెంటర్‌ ఫర్‌ పవర్‌ స్టడీస్‌ కన్వీనర్‌ ఎన్‌.వేణుగోపాల్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పుడు విధానాలు, విద్యుత్‌ సంస్థల నిర్వహణ లోపాలే దీనికి కారణమన్నారు. 
     విద్యుత్‌ చార్జీల పెంపును తట్టుకోలేక బహిరంగ మార్కెట్‌ నుంచి ఓపెన్‌ యాక్సెస్‌లో విద్యుత్‌ కొనుగోళ్లు చేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే చీఫ్‌ ఇంజనీర్‌ జీవీ మల్లికార్జునరావు పేర్కొన్నారు. 
     ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపు, గ్రిడ్‌ నిర్వహణ చార్జీల విధింపును టీసీఎస్, ఫ్యాప్సీ, సిమెంట్‌ కంపెనీలు వ్యతిరేకించాయి. రాత్రి విద్యుత్‌ వాడకంపై రాయితీలను తగ్గించడాన్ని తప్పుబట్టాయి. 
     బోరు ఎండిపోవడంతో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ను సరెండర్‌ చేసిన 30 ఏళ్ల తర్వాత రూ. 4 లక్షల బిల్లు జారీ చేశారని భువనగిరి జిల్లాకు చెందిన సామా సత్తిరెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, వివిధ వర్గాల అభ్యంతరాలపై టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి వివరణ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement