
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ అమలులో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి తప్పితే ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. ‘ఏటా 2 కోట్ల చొప్పున మోదీ సర్కార్ ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలివ్వాలి. ఈ మేరకు తెలంగాణలో 50 లక్షల ఉద్యోగాలు రావాలి. కానీ తెలంగాణలో కిషన్‌రెడ్డికి మంత్రి పదవి తప్పితే ఎవరికీ ఉద్యోగం రాలేదు’అని పేర్కొన్నారు. బుధవారం కేంద్ర రవాణా, రహదారుల శాఖ పద్దులపై చర్చలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన సునిశిత విమర్శలు చేశారు. దేశంలోని నిరుపేదలకు ఇళ్లిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పినా ఇంతవరకు అది నెరవేరలేదన్నారు. దేశ వ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలు నిర్మిస్తామని చెప్పినా.. ఎక్కడా ఆ సిటీలు కనిపించడం లేదన్నారు.
రహదారుల నిర్మాణం లేదు..
జాతీయ రహదారుల నిర్మాణంలో, వాటి నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రేవంత్ విమర్శించారు. భారతమాల కింద 34,800 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టినా ఇంతవరకు 7వేల కిలోమీటర్ల నిర్మాణాలు మాత్రమే పూర్తి చేశారని, మిగతా 80 శాతం నిర్మాణాలు ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్–విజయవాడ హైవే ఆరులైన్ల నిర్మాణం, హైదరాబాద్–బెంగళూర్ 8 లైన్ల నిర్మాణం, హైదరాబాద్–బీజాపూర్, హైదరాబాద్–మన్నెగూడ, మహబూబ్‌నగర్–చించోలి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment