బంజారాహిల్స్ (హైదరాబాద్): తెలంగాణ సర్కారుకు దమ్ముంటే అసోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వాశర్మను హైదరాబాద్‌కు లాక్కురావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీనుద్దేశించి హిమంతా చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం రేవంత్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
న్యాయసలహా పేరుతో ఫిర్యాదులను పక్కనపడేసినా, ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టకపోయినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. సోనియా మాతృత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి, సిగ్గులేకుండా మళ్లీ సమర్ధించుకుంటున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. హిమంతా వ్యాఖ్యలను కేంద్రం తీవ్రంగా తీసుకోలేదని, అందుకే తాము ఫిర్యాదులు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకే ఇంత ఘోర అవమానమా అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై గట్టిగా మాట్లాడుతున్న కేసీఆర్ వెంటనే హిమంతాను అరెస్ట్ చేసేలా చూడాలని, అవసరమైతే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. 48 గంటల్లోగా రాష్ట్రవ్యాప్తంగా 709 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయకపోతే ఈ నెల 16న 12 గంటలకు అన్ని ఎస్పీ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ నెల 18న కాంగ్రెస్ మహిళానేతల ఆధ్వర్యంలో న్యాయ, వీధి పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే సంపత్, దాసోజు శ్రవణ్, డాక్టర్ సి.రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఫిర్యాదుల పరంపర
హిమంతాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి. ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, హైదరాబాద్‌లోని పలు పీఎస్‌లలో సీనియర్ నేతలు గీతారెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, నిరంజన్, మల్లు రవి తదితరులు ఫిర్యాదు చేశారు. ఆయా జిల్లాల్లో కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, ముఖ్య నేతల ఆధ్వర్యంలో సోమవారమంతా ఫిర్యాదుల పరంపర కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment